Dosakaya Chinthakaya Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దోసకాయలు కూడా ఒకటి. దోసకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పప్పు, కూర, పులుసు, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే ఈ దోసకాయ పచ్చడిని చింతకాయలు వేసి మనం మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. చింతకాయలు వేసి చేసే ఈ దోసకాయ పచ్చడిని చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయని చెప్పవచ్చు. పుల్ల పుల్లగా ఎంతో కమ్మగా ఉండే దోసకాయ చింతకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ చింతకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దోసకాయ – 1, నూనె – 5 టీ స్పూన్స్, పచ్చి చింతకాయలు – 6, ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – 6, పసుపు – పావు టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు -ఒక రెమ్మ.

దోసకాయ చింతకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా దోసకాయను శుభ్రంగా కడగాలి. తరువాత దీనికి నూనె రాసి స్టవ్ మీద ఉంచి మంటపై కాల్చుకోవాలి. ఈ దోసకాయను అటూ ఇటూ తిప్పుతూ నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత దోసకాయను నీటిలో చల్లారనివ్వాలి. తరువాత పైన ఉండే నల్లటి పొట్టును తీసేసి కట్ చేసుకోవాలి. లోపల ఉండే గింజలను తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చి చింతకాయలను వేసి మెత్తగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ చింతకాయలను జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి 2 లేదా 3 పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు తాళింపు కోసం కళాయిలో 6 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ చింతకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. తరచూ చేసే దోసకాయ పచ్చడి కంటే ఈ విధంగా చేసిన పచ్చడి మరింత రుచిగా ఉంటుంది.