Vankaya Pachi Pulusu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో వంకాయ కూడా ఒకటి. వంకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. వంకాయతో మనం పచ్చడిని, వివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. వంకాయతో కూరలను, పచ్చళ్లనే కాకుండా పచ్చి పులుసును కూడా తయారుచేసుకోవచ్చు.
వంకాయలతో చేసే పచ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది. మనం తరచూ చేసే పచ్చి పులుసు కంటే వంకాయలను ఉపయోగించి చేసే పచ్చి పులుసు మరింత రుచిగా ఉంటుంది. వంకాయలతో పచ్చి పులుసును చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. వంకాయలతో పచ్చి పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పచ్చి పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – 2 (పెద్దవి), పచ్చి మిర్చి – 10, వెల్లుల్లి రెబ్బలు – 10 , చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, బెల్లం తురుము – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నానబెట్టిన చింతపండు – 30 గ్రా., నీళ్లు – తగినన్ని, నూనె – కొద్దిగా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఎండు మిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్.
వంకాయ పచ్చి పులుసు తయారీ విధానం..
ముందుగా వంకాయల తొడిమ తీయకుండా శుభ్రంగా కడిగి కత్తితో వంకాయ చుట్టూ నిలువుగా 5 గాట్లను పెట్టి ఒక్కో గాటు పెట్టిన చోట వంకాయ లోపలికి వెళ్లేలా ఒక పచ్చి మిర్చి, ఒక వెల్లుల్లి రెబ్బను ఉంచాలి. ఇలా ఉంచిన తరువాత వంకాయలకు నూనెను రాసి పుల్కాలను కాల్చే పెనం మీద లేదా నేరుగా మంట మీద ఈ వంకాయలను ఉంచి నల్లగా అయ్యే వరకు చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తరువాత వంకాయలను ఒక గిన్నెలోకి తీసుకుని వంకాయ తొడిమతోపాటు నల్లగా కాల్చుకున్న వంకాయ పై పొట్టును కూడా తీసేయాలి. ఇప్పుడు వంకాయలను, పచ్చి మిర్చిని మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న వంకాయలలో తరిగిన ఉల్లిపాయ ముక్కలను, బెల్లం తురుమును, ఉప్పును, చింతపండు గుజ్జును, కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తరువాత తగినన్ని నీళ్లను పోసి మరలా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న పచ్చి పులుసులో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చి పులుసు తయారవుతుంది. వేడి వేడి అన్నంతో ఈ పచ్చి పులుసును కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే పచ్చి పులుసుకు బదులుగా అప్పుడప్పుడూ ఇలా వంకాయలతో కూడా పచ్చి పులుసును చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.