Vastu Tips : మన ఇంట్లో వంటగదికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో ఒక్కో వస్తువును ఒక్కో చోట ఉంచుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో వస్తువులను సర్దుకోవడం వల్ల ఆ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. వంట గదిలో ఉంచే ముఖ్యమైన వాటిల్లో బియ్యం ఒకటి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనిషి ఏది లేకున్నా బతుకుతాడు కానీ అన్నం లేకుండా బ్రతక లేడు. అన్ని దానాలలో కంటే అన్నదానం చాలా గొప్పదని మన పెద్దలు చెబుతుంటారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న అన్నాన్ని అనగా బియ్యాన్ని వంటగదిలో ఏ దిక్కున పెడితే మన కుటుంబం అంతా అన్నానికి లోటు లేకుండా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది బియ్యం సంచిని ఇంట్లో లేదా వంటగదిలో నైరుతి మూలన ఉంచుతారు. నైరుతి మూలన బరువు ఉండాలని ఇలా పెడుతుంటారు. నైరుతి మూలన బరువు ఉండాలి కానీ ఆ బరువులు స్థిరంగా మళ్లీ మళ్లీ తీయకుండా ఉండే వాటినే ఉంచాలి. బియ్యాన్ని మనం ప్రతిరోజూ తీస్తూనే ఉంటాం. కనుక బియ్యాన్ని నైరుతి మూలను ఉంచకూడదు. చాలా మంది బియ్యాన్ని నైరుతి మూలన ఉంచి లేని సమస్యలను కొని తెచ్చుకుంటారు. బియ్యం డబ్బాలను కానీ, బియ్యం బస్తాలను కానీ నైరుతి మూలన ఉంచకూడదు. ఏ ఇంట్లోనైతే నైరుతి మూలన బియ్యం సంచులను కానీ బియ్యం డబ్బాలను కానీ ఉంచుతారో ఆ ఇంటి యజమాని అనారోగ్యానికి గురి కావడం లేదా భార్యా భర్తల మధ్య సమస్యలు రావడం, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం వంటి అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బియ్యాన్ని మన ఇంట్లో లేదా వంటగదిలో ఆగ్నేయంలో ఉంచాలి. ఏ ఇంట్లో అయితే బియ్యాన్ని ఆగ్నేయంలో ఉంచుతారో ఆ ఇల్లు ధనధాన్యాలతో, సిరిసంపదలతో తులతూగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకున్నా బియ్యాన్ని ఆగ్నేయంలోనే ఉంచాలని వారు చెబుతున్నారు. బియ్యాన్ని ఆగ్నేయంలో ఉంచడం వల్ల ఆ ఇంట్లోని వారికి అన్ని శుభాలే కలుగుతాయని వారు తెలియజేస్తున్నారు.