Veg Kurma Recipe : వెజ్ కుర్మా.. ఈ కూరను మనం అప్పుడప్పుడూ తయారు చేస్తూ ఉంటాం. చపాతీ, పరోటా వంటి వాటిని తినడానికి ఈ కూర చక్కగా ఉంటుంది. ఈ కూర తయారీలో వివిధ రకాల కూరగాయలను ఉపయోగిస్తాము కనుక ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ వెజ్ కుర్మా కూరను అందరూ ఇష్టపడేలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంప ముక్కలు – ఒక కప్పు, క్యారెట్ ముక్కలు – అర కప్పు, తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – అర కప్పు, పచ్చి బఠాణీ – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), చిన్నగా తరిగిన టమాటాలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చిమిర్చి – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, తియ్యటి పెరుగు – అర కప్పు, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గసగసాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు పలుకులు – 2 టీ స్పూన్స్, పచ్చి కొబ్బరి ముక్కలు – 4 టీ స్పూన్స్.
వెజ్ కుర్మా తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చి బఠాణీని వేయాలి. తరువాత అందులో ఒక గ్లాస్ నీటిని పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో గసగసాలు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు కలుపుతూ వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి ముక్కలను ముందుగా ఉడికించుకున్న కూరగాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతపు ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కసూరి మెంతిని, గరం మసాలాను వేసి కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ కుర్మా తయారవుతుంది. దీనిని చపాతీ, దోశ, పుల్కా, పరోటా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వెజ్ కుర్మాను తినడం వల్ల రుచితో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను కూడా పొందవచ్చు.