Veg Lollipop : సాయంత్రం సమయంలో తినేందుకు స్నాక్స్ ఏం ఉన్నాయి.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇంట్లో స్నాక్స్ లేకపోతే బయటకు వెళ్లి తింటారు. అయితే బయటకు వెళ్లి తినడం కన్నా ఇంట్లోనే వాటిని చేసుకోవడం ఎంతో బెటర్. దీంతో ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. ఇక ఇంట్లో చేసుకోదగిన స్నాక్స్‌లో వెజ్ లాలిపప్స్ కూడా ఒకటి. ఇవి మనకు సాధారణంగా రెస్టారెంట్లలోనే లభిస్తాయి. కానీ ఇంట్లోనూ మనం ఎంతో రుచిగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే వెజ్ లాలిపప్స్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ లాలిపప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన ఆలుగడ్డలు – 3, క్యారెట్ – 1, క్యాప్సికం – సగం ముక్క, పచ్చి మిర్చి – 2, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు, పనీర్ తురుము – 50 గ్రాములు, కారం – 1 టీస్పూన్, కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ పొడి – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, కార్న్ ఫ్లోర్, మైదా – 1 టేబుల్ స్పూన్, నూనె – తగినంత, అల్లం, వెల్లుల్లి, క్యాప్సికం తురుము – 1 టీస్పూన్ చొప్పున, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున, టమాటా కెచప్ – 3 టేబుల్ స్పూన్లు, వైట్ వెనిగర్ – 1 టీస్పూన్.
వెజ్ లాలిపప్స్‌ను తయారు చేసే విధానం..
ఉడికించిన ఆలుగడ్డలను పెద్ద గిన్నెలో వేసి మెత్తగా మెదపాలి. ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, పనీర్ తురుము, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీనికి బ్రెడ్ పొడిని కూడా జత చేయాలి. ఇప్పుడీ ముద్దను గుడ్డు లేదా గుండ్రంగా మీకు నచ్చిన ఆకారంలో చేసుకుని పుల్లకు గుచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. మరో గిన్నెలో కార్న్ ఫ్లోర్, మైదా, చిటికెడు ఉప్పు, కాస్తంత మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి కాస్త చిక్కగా బజ్జీ పిండిలా కలపాలి. ఇందులో లాలిపప్‌ను ముంచాలి. ఆ తరువాత బ్రెడ్ పొడిలో దొర్లించాలి. ఇలా అన్ని లాలిపప్స్‌ను చేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేయాలి.
అది వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఇందులోనే కొన్ని ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి మరికాసేపు వేయించాలి. ఆ తరువాత వరుసగా చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా కెచప్, వెనిగర్ వేసి బాగా కలపాలి. పెద్ద టీస్పూన్ కార్న్ ఫ్లోర్ ద్రవాన్ని ఇందులో పోయాలి. ఇది కాస్త దగ్గర పడిన తరువాత మిరియాల పొడి వేసి పక్కన పెట్టేయాలి. పొయ్యి మీద మరో కడాయి పెట్టి నూనె పోయాలి. కాగిన నూనెలో లాలిపప్స్ వేసి మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వీటిని సాస్‌తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి.