Bell In Pooja Room : పూజ చేసుకునేటప్పుడు కూడా ఓ పద్దతి ఉంటుంది. కచ్చితంగా పద్దతి ప్రకారమే పూజలు చేయాలి. దేవాలయంలో పూజ చేసినప్పుడు, లేదంటే ఇంట్లో పూజ చేసినప్పుడు గంటను కొడుతూ ఉంటారు. హారతి ఇచ్చినప్పుడు కూడా గంటను మోగిస్తూ ఉంటారు. దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి, హారతి ఇచ్చినప్పుడు గంట కొడుతూ ఉంటారు. అలానే ఆ సమయంలో ఆ దైవాంశ ఆ విగ్రహంలోనికి చేరాలని ప్రార్థిస్తున్నామని గంట కొడతారు.
గంట నాలుకలో సరస్వతీ మాత కొలువై ఉంటుందట. గంట ఉదర భాగంలో మహా రుద్రుడు, ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కొన భాగంలో వాసుకి, పైన ఉండే పిడి భాగంలో ప్రాణ శక్తి ఉంటాయని పురాణాల ద్వారా చెబుతున్నారు. అందుకనే గంటని ఎంతో పవిత్రంగా భావించాలి. నిత్యం పూజ చేసేటప్పుడు గంటని తప్పనిసరిగా వాడుతుంటాం.
గంట శబ్దం చేస్తూ పూజ చేయడం వెనుక అర్థం చాలా మందికి తెలియదు. గంట శబ్దం ఎంత దూరమైతే వినపడుతుందో, అంత దూరం దాకా దుష్టశక్తులు ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి. పైగా గంట శబ్దం శుభాన్ని సూచిస్తుంది. గంట మోగించడం వలన వచ్చే ధ్వని తరంగాలు ఆధ్యాత్మిక భావాలను తీసుకొస్తాయి. మానసిక రుగ్మతలను దూరం చేస్తూ ప్రశాంతతను ఇస్తాయి.
గంటను ఎప్పుడూ లయబద్ధంగా మోగించాలి. అలానే గంటలలో కూడా రకరకాలు ఉంటాయి. శివుడికి నంది గంట. అంటే నంది ఆకారంలో చెక్కబడిన గంట. విష్ణువుకైతే ఆంజనేయుడు లేదా గరుత్మంతుడి ఆకారంలో చెక్కబడిన గంటని ఉపయోగించాలి. వినాయకుడు, శృంగి, శంఖు చక్రాదులు ఇలా రకరకాల స్వరూపాలు గల గంటలు ఉంటాయి. అమ్మవారి పూజకైతే అందరూ బంటులే కాబట్టి ఏ రూపం గల గంటనైనా కూడా వాడవచ్చు.