Wheat Flour Gulab Jamun : మనం పండగలకు, ప్రత్యేకమైన రోజులప్పుడు వివిధ రకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. చాలా త్వరగా చేయగలిగే తీపి పదార్థాలు అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది గులాబ్ జామున్. గులాబ్ జామున్ ను మనం ప్త్యేకమైన గులాబ్ జామున్ మిక్స్ తో తయారు చేస్తూ ఉంటాం. అయితే ఈ గులాబ్ జామున్ మిక్స్ తోనే కాకుండా మనం గోధుమపిండితో కూడా గులాబ్ జామున్ లను తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసే ఈ గులాబ్ జామున్ లు అచ్చం బయట లభించే విధంగా ఉండే వాటిలాగే ఉంటాయి. గోధుమపిండితో రుచిగా ఉండే గులాబ్ జామున్ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ పిండి గులాబ్ జామున్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, పాల పొడి – అర కప్పు, బేకింగ్ పౌడర్ – అర కప్పు, కాచి చల్లార్చిన పాలు – అర కప్పు, పంచదార – ఒకటిన్నర కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గోధుమపిండి గులాబ్ జామున్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పంచదార, నీళ్లు పోసి పంచదార కరిగే వరకు తిప్పుతూ వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా జిగురుగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఇందులో యాలకుల పొడి, నిమ్మరసం వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గోధుమపిండి వేసి 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో పాలపొడి, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరువాత తగినన్ని పాలు పోసుకుంటూ సున్నితంగా పిండిని కలిపి 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. తరువాత తగినంత పరిమాణంలో పిండిని తీసుకుంటూ గుండ్రంగా గులాబ్ జామున్ ల ఆకారంలో చేసుకోవాలి. గులాబ్ జామున్ లను వేయించే ముందు స్టవ్ మీద ముందుగా తయారు చేసుకున్న పంచదార మిశ్రమాన్ని ఉంచి చిన్న మంటపై వేడి చేయాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత గులాబ్ జాములను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని నూనె నుండి తీసి పంచదార మిశ్రమంలో వేయాలి. ఇలా అనకనీ గులాబ్ జాములను వేసిన తరువాత సస్టవ్ ఆఫ్ చేయాలి. దీనిపై మూతను ఉంచి గంట లేదా రెండు గంటల పాటు పక్కకు ఉంచాలి. తరువాత వీటిని గిన్నెలోకి తీసుకుని తినాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి గులాబ్ జామున్ లు తయారవుతాయి. వీటిని తినే వాళ్లకి వీటిని మనం గోధుమ పిండితో చేసామని చెప్తే కానీ తెలియదు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా గోధుమపిండితో ఎంతో రుచిగా ఉండే గులాబ్ జామున్ లను తయారు చేసుకుని తినవచ్చు.