Sprouts : అన్నీ పోషకాలు తగిన మోతాదులో ఉండే ఆహారాల్లో మొలకెత్తిన గింజలు ఒకటి. విటమిన్లు, ఖనిజ లవణాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పెసర్లు, శనగలు, పల్లీలను మొలకెత్తించి తీసుకోవాలి. మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వైద్యులు కూడా వీటిని ఆహరంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. మొలకెత్తిన గింజలు శరీరాన్ని శుద్ధి చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరం చైతన్యవంతమై నిత్య యవ్వనంగా కనిపించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గింజలను మొలకెత్తించినప్పుడు వాటిలో పోషక విలువలు పెరుగుతాయి. ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో తెలియక చాలా మంది క్యాలరీలు అధికంగా ఉన్న వాటిని తీసుకుంటున్నారు.
మరికొందరు డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటున్నారు. దీంతో శరీర బరువు, ఆరోగ్యం విషయంలో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. పోషకాల నిధి అయినటువంటి మొలకెత్తిన గింజల్లో జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్ లు అధికంగా ఉంటాయి. ఈ ఎంజైమ్ లు ప్రోటీన్లను, శరీరానికి ఉపయోగపడే ఆమైనో ఆమ్లాలను, పిండి పదార్థాలను గ్లూకోజ్ గా మారుస్తాయి. అలాగే మొలకెత్తిన గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి వంటివి అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ కె రక్త గడ్డకట్టడానికి, కాలేయ పనితీరు సక్రమంగా పని చేయడానికి తోడ్పడుతుంది. మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. మనం పెసర్లు, శనగలు, పల్లీలు, బఠాణీలు, గోధుమలు, జొన్నలు, సోయా బీన్స్, చిక్కుడు వంటి వాటిని మొలకెత్తించి తీసుకోవచ్చు.

ఈ గింజలు మొలకెత్తడానికి తేమ, కొద్దిగా వెచ్చదనం అవసరం. ఆరోగ్యానికి హానిని కలిగించే కొవ్వు, కెలస్ట్రాల్ వంటివి వీటిలో ఉండవు. శరీరాన్ని సంరక్షించే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. మొలకలకు క్షార గుణం ఎక్కువగా ఉంటుంది. గర్భిణీలు మొలకలు తింటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. మొలకలు జీవంతో కూడుకున్న ఎంజైమ్ లు ఉన్న సహజమైన ఆహారం. మొలకల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని నివారిస్తాయి. ఈ గింజలు మొలకెత్తేటప్పుడు విటమిన్ ఎ 2 రెట్లు, విటమిన్ బి మరియు సి లు 5 నుండి 10 రెట్లు అధికంగా లభ్యమవుతాయి. పిండి పదార్థాలు సరళీకృత చక్కెరలుగా, మాంసకృత్తులు సులభంగా జీర్ణమయ్యే అమైనో ఆమ్లాలుగా, కొవ్వులు ఆవశ్యక కొవ్వు ఆమ్లాలుగా తయారవుతాయి.
ఖనిజలవణాలైన క్యాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటివి శరీరానికి సులభంగా అందుబాటులో ఉండేలా తయారవుతాయి. దీని వల్ల దంతాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. రక్తహీనత కూడా తగ్గుతుంది. మొలకెత్తిన గింజలను అలాగే తినవచ్చు లేదా ఇతర ఆహారాల్లో కలుపుకుని తినవచ్చు. మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాట, క్యారెట్ తురుము, చిటికెడు ఉప్పు, పసుపు, కొద్దిగా కొత్తిమీర కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా తినడం వల్ల వాటిలోని పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి. మొలకెత్తిన గింజల్లో కీర, క్యారెట్, బీట్ రూట్ వంటి కూరగాయల తురుములను కలుపుకుని తినవచ్చు. గింజలను ఎలా మొలకెత్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాణ్యమైన గింజలను తీసుకుని శుభ్రపరచాలి.
తరువాత వాటిని 6 నుండి 8 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. పెసర్లు త్వరగా నానుతాయి. సోయా, చిక్కుళ్లు వంటి నానడానికి ఎక్కువ సమయం పడుతుంది. గింజలను నానబెట్టిన తరువాత పొట్టు రాకుండా ఒకటి , రెండుసార్లు శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని తడిపిన శుభ్రమైన వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. తడి ఆరిపోకుండా అప్పుడప్పుడు నీటిని చల్లుతూ ఉండాలి. గింజలు మొలకెత్తడానికి వాతవరణ ప్రభావం చాలా ఉంటుంది. వేసవి కాలంలో గింజలు త్వరగా మొలకెత్తుతాయి. మిగిలిన కాలాల్లో గింజలు మొలకెత్తడానికి ఒకటి లేదా రెండు రోజుల సమయం పడుతుంది.
అదే సమయంలో గట్టి గింజలు మొలకెత్తడానికి మరింత సమయం పడుతుంది. ప్రస్తుతం మొలకలు తయారు చేసుకోవడానికి ప్రత్యేక బాక్సులు కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మొలకలు తయారు చేసుకోవడానికి తాజా విత్తనాలను ఎంచుకోవడం మంచిది. ఈ మొలకెత్తిన గింజలను సాయంత్రం ఆరు, ఏడు గంటల సమయంలో తినకూడదు. మధ్యాహ్న భోజనంలో మాంసాహారం తీసుకుంటే సాయంత్రం సమయంలో మొలకెత్తిన గింజలను తీసుకోవాలి. దీని వల్ల మాంసాహారంలోని అధిక కొవ్వు చేసే పదార్థాల నుండి తప్పించుకోవచ్చు. ఎటువంటి కానీ సమయంలో ఆకలేస్తే చిరుతిళ్లను తినకుండా మొలకెత్తిన గింజలను తీసుకోవాలి. వీటిని రోజూ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మనకు అందుతుందని నిపుణులు చెబుతున్నారు.