Wheat Rava Khichdi : మనం ఆహారంలో భాగంగా గోధుమ రవ్వను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమ రవ్వ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రవ్వతో తీపి వంటకాలే కాకుండా అల్పాహారాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. గోధుమ రవ్వతో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారాలలో గోధుమ రవ్వ కిచిడీ కూడా ఒకటి. ఈ కిచిడీని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే గోధుమ రవ్వ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ రవ్వ – అర కప్పు, పెసర పప్పు – అర కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, టమాట తరుగు – అర కప్పు, పచ్చి బఠాణీ – పావు కప్పు, క్యారెట్ తరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, కొత్తిమీర – ఒక చిన్న కట్ట, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – రెండున్నర కప్పులు, తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం తరుగు – ఒక టీ స్పూన్.
గోధుమ రవ్వ కిచిడీ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం తరుగు, టమాట ముక్కలు, పచ్చి బఠాణీ, క్యారెట్ తరుగు వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత పెసరపప్పు, గోధుమ రవ్వ వేసి వేయించాలి. గోధుమ రవ్వ ఎర్రగా వేగిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి కొత్తిమీర, నెయ్యి వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ కిచిడీ తయారవుతుంది. దీనిని అల్పాహారంగా లేదా భోజనంగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా గోధుమ రవ్వతో చేసిన కిచిడీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.