Dahi Paneer Pulao : పనీర్.. ఇది మనందరికి తెలిసిందే. పనీర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పనీర్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పనీర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో దహీ పనీర్ పులావ్ కూడా ఒకటి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండడంతో పాటు సలుభంగా అయ్యే ఈ పనీర్ పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దహీ పనీర్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పనీర్ ముక్కలు – ఒక కప్పు, పెరుగు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, అర గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 2, యాలకులు – 3, బిర్యానీ ఆకులు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, సన్నా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, టమాట పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 6, నీళ్లు – ఒకటిన్నర కప్పు.
దహీ పనీర్ పులావ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పన్నీర్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, పెరుగు వేసి కలపాలి. తరువాత మరో గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత మిగిలిన అల్లం పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట పేస్ట్ వేసి కలపాలి. దీనిని కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత నానబెట్టిన బియ్యం, పనీర్ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు నీరంతా పోయి పులావ్ దగ్గర పడే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి.
తరువాత మూత పెట్టి చిన్న మంటపై మరో 6 నుండి 8 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత చిన్న కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఇందులో జీడిపప్పు వేసి వేయించి పులావ్ పై వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దహీ పన్నీర్ పులావ్ తయారవుతుంది. దీనిని మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పనీర్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పులావ్ ను కూడా వండుకుని తినవచ్చు. ఈ పులావ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.