Lord Ganesha : వినాయకుడి ఆలయాల్లో చూసినా, లేదంటే ఇళ్లల్లో వినాయకుడిని పూజించేటప్పుడు అయినా గుంజీలని తీస్తూ ఉంటారు. దీన్ని మీరు కూడా గమనించారా..? అయితే, ఎందుకు వినాయకుడి దగ్గర గుంజీలు తీయాలి..? అసలు ఈ సాంప్రదాయం ఎప్పుడు వచ్చింది..? అసలు ఎందుకు గుంజీలు తీయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. వినాయకుడి ముందు అందరూ గుంజీలు తీస్తారు. అలానే ఏదైనా పూజని మొదలుపెట్టేముందు, కచ్చితంగా మొదట వినాయకుడిని కొలిచి, ఆ తర్వాత మరే దేవుడునైనా మనం పూజిస్తూ ఉంటాము.
వినాయకుడికి అటుకులు, బెల్లం, చెరుకు, కుడుములు, ఉండ్రాళ్ళు అంటే ఇష్టం. వీటిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే, ఇక గుంజీలు తీసే ఆచారం గురించి చూస్తే.. శ్రీమహావిష్ణువు మేనల్లుడైన గణపతికి బహుమతులు తీసుకువచ్చే వారట. బహుమతుల్ని చూపిస్తూ సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టారు విష్ణువు. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని మింగేశారట. కాసేపటికి సుదర్శన చక్రం ఏది అని అడిగితే, మింగేశానని చెప్పాడు వినాయకుడు.
మహావిష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలి అని.. చివరికి చెవులు రెండు పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. అది చూసి, ఆనందం వేసి, పెద్దగా నవ్వాడు వినాయకుడు. నవ్వుతున్నప్పుడు సుదర్శన చక్రం బయటకు వచ్చింది. అప్పటి నుండి కోరికలు నెరవేరాలంటే, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి గుంజీలు తీయడం ఆచారంగా మారింది.
అందుకని మనం కూడా ఏదైనా కోరికలు నెరవేరాలంటే, వినాయకుడిని ప్రార్థించేటప్పుడు గుంజీలు తీస్తే, అప్పుడు అనుకున్నవి జరుగుతాయి. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నాము. ఇలా చేయడం వలన వ్యాయామం కూడా అవుతుంది. స్కూల్స్ లో గుంజీలు తీయమని శిక్ష వేస్తారు. గుంజీలు తీస్తే మెదడు బాగా పని చేస్తుందట.