Besan Burfi : మనం ఆహారంలో భాగంగా శనగపపప్పుతోపాటు శనగపిండిని కూడా తీసుకుంటూ ఉంటాం. శనగపిండితో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. శనగపిండితో చేసుకోదగిన తీపి వంటకాల్లో బర్ఫీ కూడా ఒకటి. శనగపిండితో చేసిన బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి సమయం కూడా ఎక్కువగా పట్టదు. శనగపిండితో బయట లభించే విధంగా బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెసన్ బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగ పిండి – ఒక కప్పు, నెయ్యి – పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ, పంచదార – అర కప్పు, నీళ్లు – పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
బెసన్ బర్ఫీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక శనగపిండిని వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలుపుతూ చిన్న మంటపై 15 నిమిషాల పాటు వేడి చేయాలి. నెయ్యిలో శనగపిండి వేయగానే మొదట గట్టిగా అవుతుంది. వేడి చేసే కొద్ది పలుచగా అవ్వడంతోపాటు రంగు కూడా మారుతుంది. శనగపిండి, నెయ్యి మిశ్రమం పలుచగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. ఇప్పుడు మరో కళాయిలో పంచదారను, నీళ్లను పోసి పంచదార కరిగే వరకు కలుపుతూ వేడి చేయాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని లేత పాకం వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
పంచదార మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత ముందుగా తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలి. ఇందులోనే యాలకుల పొడి కూడా వేసి రెండు కలిసేలా బాగా కలపాలి. శనగపిండి మిశ్రమం ఒక ముద్దలా అయిన తరువాత వెంటనే దీనిని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని గ్లాస్ లేదా గిన్నెతో సమానంగా చేసుకోవాలి. దీనిపై డ్రై ఫ్రూట్స్ ను చల్లి కొద్దిగా చల్లారే వరకు ఉంచాలి.
తరువాత మనకు కావల్సిన ఆకారంలో కత్తితో గాట్లు పెట్టుకుని పూర్తిగా చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెసన్ బర్ఫీ తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో లేదా బయట ఉంచి కూడా నిల్వ చేసుకోవచ్చు. తీపిని ఎక్కువగా ఇష్టపడే వారు ఇలా శనగపిండితో బర్ఫీని తయారు చేసుకుని తినవచ్చు.