మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి.
మన శరీరం సరిగ్గా పనిచేసేందుకు పొటాషియం ఎంతగానో అవసరం అవుతుంది. మన శరీరంలోని కణాలకు పొటాషియం రోజూ అవసరం అవుతుంది. ఇది శరీరంలో అనేక క్రియలను నిర్వహిస్తుంది. కండరాలు, నాడుల పనితీరు, గుండె కొట్టుకోవడం, శక్తిని ఉత్పత్తి చేయడం, న్యూక్లిక్ యాసిడ్లు, ప్రోటీన్ల సంశ్లేషణ వంటి పనులకు పొటాషియం అవసరం అవుతుంది. శరీరంలో నీటి స్థాయిలను నియంత్రించేందుకు కూడా పొటాషియం అవసరం అవుతుంది.
పొటాషియం లోపిస్తే మన శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. కండరాలు బలహీనంగా మారుతాయి. కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. అలసట, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం, ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, హైపోకలేమియా, వాంతులు, విరేచనాలు అవుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మలంలో రక్తం కూడా వస్తుంది. అందువల్ల శరీరంలో పొటాషియం లోపం ఏర్పడకుండా చూసుకోవాలి.
సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం తినే ఆహారాల నుంచే మనకు పొటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు.
కోడిగుడ్లు, టమాటాలు, చిలగడ దుంపలు, విత్తనాలు, నట్స్, అరటి పండ్లు, యాప్రికాట్స్, చేపలు, తృణ ధాన్యాలు, పెరుగు, పాలు, మాంసం, తర్బూజా, క్యారెట్, నారింజ, కివీ, కొబ్బరినీళ్లు, బీట్‌రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది.