ఐరన్‌ లోపం ఉంటే కనిపించే లక్షణాలివే.. ఏయే ఆహారాలను తీసుకోవాలంటే..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భారతీయుల్లో చాలా మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఐరన్‌ లోపిస్తే శరీరంలో రక్తం సరిగ్గా తయారుకాదు. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. శరీరం తగనన్ని ఎర్ర రక్త కణాలను తయారు చేసుకోలేదు. దీంతో సమస్యలు వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఐరన్‌ ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది.

iron deficiency symptoms iron foods list

మన శరీరంలోని భాగాలకు, కణాలకు ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను రవాణా చేస్తాయి. అయితే ఇందుకు హిమోగ్లోబిన్‌ అనే ప్రోటీన్‌ అవసరం అవుతుంది. కానీ హిమోగ్లోబిన్‌ తయారు కావాలంటే ఐరన్‌ అవసరం అవుతుంది. అందుకని ఐరన్‌ ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఐరన్‌ లోపిస్తే హిమోగ్లోబిన్‌ సరిగ్గా ఉత్పత్తి కాదు. దీంతో ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను రవాణా చేయలేవు. ఫలితంగా శరీర భాగాలకు ఆక్సిజన్‌ సరిగ్గా అందదు. దీంతో ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

మన శరీరంలో ఐరన్‌ లోపిస్తే మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే…

  • అలసట
  • నీరసం
  • చర్మం తెలుపు లేదా పసుపు పచ్చ రంగులోకి మారుతుంది.
  • గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
  • తల తిరిగినట్లు అనిపిస్తుంది.
  • ఛాతిలో నొప్పి వస్తుంది. కండరాల నొప్పులు ఉంటాయి.
  • చేతులు, కాళ్లు చల్లగా మారుతాయి.
  • గోర్లు పెళుసుగా మారి చిట్లుతాయి. వెంట్రుకలు రాలిపోతాయి.
  • నోటి పక్క భాగంలో పగులుతుంది.
  • నాలుక పుండ్లు పడినట్లు ఉంటుంది. వాపులు కనిపిస్తాయి.
  • నిద్రించేటప్పుడు కాళ్లను అటు ఇటు తరచూ కదిలిస్తారు.

ఐరన్‌ లోపం సమస్యను పరిష్కరించకుంటే ఏమవుతుంది ?

  • శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
  • డిప్రెషన్‌కు గురవుతారు.
  • ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాలు పెరుగుతాయి.
  • గర్భిణీలు నెలలు నిండకుండానే ప్రసవించేందుకు అవకాశం ఉంటుంది.
  • శిశువులు చాలా తక్కువ బరువుతో జన్మిస్తారు.
  • గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
  • పిల్లల్లో అయితే ఎదుగుదలలో లోపాలు కనిపిస్తాయి.

పైన తెలిపిన లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఐరన్‌ లోపం ఉన్నట్లు వెల్లడి అయితే డాక్టర్‌ ఐరన్‌ లోపంను పోగొట్టేందుకు ట్యాబ్లెట్లను రాసిస్తారు. అలాగే నిత్యం విటమిన్‌ సి ఉన్న ఆహారాలను తినడం వల్ల శరీరం ఐరన్‌ను ఎక్కువగా శోషించుకుంటుంది. దీంతోపాటు ఐరన్‌ ఉండే ఆహారాలను కూడా తినాల్సి ఉంటుంది.

ఐరన్‌ ట్యాబ్లెట్లను ఎప్పుడూ డాక్టర్‌ సూచన మేరకే కొంత కాలం పాటు వాడాలి. ఎక్కువ కాలం పాటు వాడినా, అధిక మోతాదులో ఆ ట్యాబ్లెట్లను తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్‌ వస్తాయి. మలబద్దకం, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, విరేచనాలు, గుండెల్లో మంట, మలం నల్లగా రావడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు

  • చికెన్‌, టర్కీ, బాతు మాంసం
  • మటన్‌, పోర్క్‌, పౌల్ట్రీ ఉత్పత్తులు
  • ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, ఆకుకూరలు (పాలకూర, బ్రొకొలి మొదలైనవి)
  • పచ్చి బఠానీలు, బీన్స్‌, ఇతర చిక్కుడు జాతి కాయలు, గింజలు
  • తృణ ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్‌, ప్రూన్స్, యాప్రికాట్స్, అంజీర్‌, కిస్మిస్‌

ఈ పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల ఐరన్‌ లోపం రాకుండా ఉంటుంది.

Share
Admin

Recent Posts