Vitamin D : కరోనా నేపథ్యంలో రోగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు విటమిన్ డి ట్యాబ్లెట్లను తీసుకోవడం ఎంతో ఆవశ్యకంగా మారింది. విటమిన్ డి వల్ల రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుంది. దీంతో కరోనా నుంచి త్వరగా బయట పడవచ్చు. అయితే కొందరికి విటమిన్ డి లోపం ఉంటుంది. అలాంటి వారికి డాక్టర్లు విటమిన్ డి ట్యాబ్లెట్లను రాసిస్తుంటారు. కానీ కొందరు మాత్రం అవసరం ఉన్నా లేకపోయినా.. విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడుతుంటారు. అలా వాటిని వాడడం ప్రమాదకరం. మన శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.
విటమిన్ డి మన శరీరంలో ఎక్కువైతే ఆకలి తగ్గుతుంది. అసలు ఏమీ తినాలనిపించదు. సడెన్ గా ఉన్నట్లుండి బరువు తగ్గుతారు. అసాధారణ రీతిలో గుండె కొట్టుకుంటుంది. మరీ ఎక్కువ వేగంగా లేదా మరీ తక్కువ వేగంగా గుండె కొట్టుకుంటుంది. అలాగే రక్తనాళాలు గట్టి పడతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీలు కూడా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. కనుక విటమిన్ డి ట్యాబ్లెట్లను అవసరం లేకపోయినా వేసుకోరాదు. కేవలం విటమిన్ డి లోపం ఉన్నవారు మాత్రమే అది కూడా డాక్టర్ సూచన మేరకు వాటిని వాడుకోవాలి.
ఇక విటమిన్ డి వల్ల మన శరీరం మనం తినే ఆహారాల్లో ఉండే కాల్షియంను సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా విటమిన్ డి అడ్డుకుంటుంది. దీంతో క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో ఇన్‌ఫెక్షన్లు, వాపులు తగ్గుతాయి.
విటమిన్ డి మనకు సూర్యరశ్మి నుంచి కూడా లభిస్తుంది. రోజూ ఉదయాన్నే 7 నుంచి 8 గంటల మధ్య సుమారుగా 20 నుంచి 30 నిమిషాల పాటు శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. దీంతో మన శరరీం విటమిన్ డిని దానంతట అదే తయారు చేసుకుంటుంది. ఇక ఎలాంటి పోషకాలు తీసుకోకున్నా ఫర్వాలేదు. అలాగే విటమిన్ డి మనకు పలు ఆహారాల్లో కూడా లభిస్తుంది.
పచ్చి బఠానీలు, గుడ్లు, చేపలు, చీజ్, పుట్ట గొడుగులు, రొయ్యలు, పాలు.. తదితర ఆహారాల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. కనుక వీటిని రోజూ తీసుకుంటే విటమిన్ డి లోపం నుంచి బయట పడవచ్చు.
ఇక 19 ఏళ్లు అంతకన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి రోజుకు 400 ఐయూ మోతాదులో విటమిన్ డి అవసరం అవుతుంది. అలాగే 19 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు వారికి రోజుకు 600 ఐయూ మోతాదులో విటమిన్ డి అవసరం. 70 ఏళ్లు పైబడిన వారికి రోజుకు 800 ఐయూ మోతాదులో విటమిన్ డి అవసరం అవుతుంది. ఇంతకన్నా డోసు మించితే దుష్పరిణామాలు కలుగుతాయి. కనుక విటమిన్ డిని రోజూ అవసరం అయిన మేర మాత్రమే తీసుకోవాలి.