మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండ్లు ముఖ్యమైనవి. ఇవి తక్కువ ధరను కలిగి ఉండడమే కాదు, పోషకాలను కూడా అధికంగానే కలిగి ఉంటాయి. అందువల్ల అరటి పండ్లను తింటే పోషకాలతోపాటు శక్తి కూడా లభిస్తుంది. అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ నీరసంగా, అలసటగా ఉందని ఫిర్యాదు చేసేవారు, యాక్టివ్‌గా ఉండడం లేదని అనుకునేవారు, చిన్న పనికే అలసిపోయే వారు రోజుకు రెండు సార్లు ఒక్క అరటి పండు చొప్పున తింటుండాలి. దీంతో శరీరానికి శక్తి లభించి ఆయా సమస్యలు తగ్గుతాయి.
2. అరటి పండ్లను తినడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. నిద్ర సరిగ్గా పట్టని వారు రాత్రి పూట ఒక అరటి పండును భోజనం అనంతరం తినాలి. ఈ పండ్లలో ఉండే మెగ్నిషియం, పొటాషియం చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. దీంతో నిద్రలేమి తగ్గుతుంది. గాఢ నిద్రలోకి జారుకుంటారు.
3. అరటి పండ్లలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. దీంతో శరీరానికి పోషణ లభిస్తుంది. విటమిన్ బి6, పొటాషియం, విటమిన్ సి, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్, ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి.
4. అరటి పండ్లలో రెండు రకాల ఫైబర్ ఉంటుంది. పెక్టిన్, రెసిస్టెంట్ స్టార్చ్. ఇవి రెండూ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి.
5. అరటి పండ్లను తినడం వల్ల అధిక బరువను తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
6. అరటి పండ్లలో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
7. అరటి పండ్లలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి.
8. అరటి పండ్లను తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు పోతాయి. కిడ్నీలు శుభ్రంగా మారుతాయి.