చెర్రీ పండ్లు.. చూడగానే నోరూరిస్తుంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి. వీటి రుచి ఎంతో తియ్యగా ఉంటుంది. చెర్రీ పండ్లను ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఈ పండ్లలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క్రమంలోనే చెర్రీ పండ్లను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చెర్రీ పండ్లలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ సి, పొటాషియం, కాపర్, మాంగనీస్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. శరీరానికి శక్తి అందుతుంది. నీరసంగా ఉన్నవారు, అలసిపోయిన వారు చెర్రీ పండ్లను తింటే తక్షణమే శక్తి లభిస్తుంది. చిన్నారులకు వీటిని తినిపిస్తే వారు ఉత్సాహంగా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. మెదడు చురుగ్గా ఉంటుంది.
2. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల వాపులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె జబ్బులు, డయాబెటిస్, పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
3. రోజూ వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారిలో కండరాలు దెబ్బ తింటుంటాయి. అందుకు గాను వారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే చెర్రీ పండ్లను తినాలి. దీని వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి, కండరాలు దెబ్బ తినకుండా ఉంటాయి. వాపులు తగ్గుతాయి.
4. ఒక కప్పు చెర్రీ పండ్లను తింటే మనకు రోజులో కావల్సిన పొటాషియంలో 10 శాతం లభిస్తుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. శరీరంలో అధికంగా ఉండే సోడియం బయటకు పోతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
5. ఆర్థరైటిస్, గౌట్ సమస్యలు ఉన్నవారు చెర్రీ పండ్లను రోజూ తినాలి. ఈ పండ్లలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి వాపులను, నొప్పులను తగ్గిస్తాయి. దీంతో ఆర్థరైటిస్, గౌట్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రోజూ చెర్రీ పండ్లను తినాలి. ఈ పండ్లలో మెలటోనిన్ మనకు సహజసిద్ధంగా లభిస్తుంది. ఇది నిద్ర వచ్చేలా చేస్తుంది. కనుక చెర్రీ పండ్లను రోజూ తింటే నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. నిద్ర బాగా పడుతుంది.
చెర్రీ పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తీసుకోవచ్చు. సాయంత్రం జంక్ ఫుడ్ తినే బదులు ఈ పండ్లను తింటే మంచిది. వీటిని సలాడ్స్, జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365