Jamakayalu : పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనందరికి తెలిసిందే. అలాగే మనం రకరకాల పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో జామపండ్లు ఒకటి. వీటిని తినని వారు ఉండరనే చెప్పవచ్చు. దాదాపు సంవత్సరమంతా ఇవి మనకు లభిస్తూనే ఉంటాయి. జామకాయలు అందరికి అందుబాటు ధరల్లో చాలా చౌకగా లభిస్తూ ఉంటాయి. చాలా మంది జామకాయలే కదా అని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ జామకాయలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జామకాయల వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జామకాయలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.
చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అధిక ధరలతో కూడిన పండ్లల్లో ఉండే పోషకాలన్నీ ఈ జామకాయలో ఉంటాయి. జామకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామకాయ పండే కొద్ది దీనిలో విటమిన్ సి శాతం తగ్గుతూ ఉంటుంది. జామకాయలో విటమిన్ సి తో పాటు విటమిన్ కె, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్,ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా జామకాయను నిరభ్యంతరంగా తినవచ్చు. డయాబెటిస్ ఉన్న వారికి జామకాయ ఒక సంజీవనిలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దీనిలో అధికంగా ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అదే విధంగా బరువు తగ్గాలనేకునే వారికి కూడా జామకాయ చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలిగి మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే జామకాయను తినడం వల్ల శరీరానికి పోషకాలు అంది నీరసం రాకుండా ఉంటుంది. అదే విధంగా మెటబాలిజాన్ని పెంచి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి కూడా జామకాయకు ఉంది. కనుక ఊబకాయంతో బాధపడే వారు జామకాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
జామకాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ కణాలను నశింపజేయడంలో దోహదపడతాయి. ఎసిడిటీ సమస్యతో నేటి కాలంలో చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వారు రోజుకో జామపండును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకంతో బాధపడే వారు బాగా పండిన జామపండుపై మిరియాల పొడి, నిమ్మరసం చల్లుకుని తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే దంతాల సమస్యలతో బాధపడే వారు జామ ఆకులను నమలడం వల్ల దంతాల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా దంతాల, చిగుళ్లు ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే వారు జామ ఆకులను కొద్దిగా వేడి చేసి నొప్పులు, వాపులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
అలాగే రోజుకో జామకాయను తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. అదేవిధంగా జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా సంతాన లేమితో బాధపడే స్త్రీ, పురుషులిద్దరూ ఈ జామకాయను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జామకాయను ముక్కలుగా చేసి రెండు నుండి మూడు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అధిక దాహం సమస్యతో బాధపడే వారు ఇలా జామకాయ ముక్కలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా జామకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.