చిన్నారులకు రోజూ అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను అందించినప్పుడే వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. దీంతోపాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా సరిగ్గా ఎదుగుతారు. చదువుల్లోనూ రాణిస్తారు. అందువల్ల వారికి రోజూ పౌష్టికాహారాలను తినిపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కింద తెలిపిన ఆహారాలను చిన్నారులకు రోజూ ఇవ్వడం వల్ల వారికి పోషకాలు అందడమే కాదు, అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. ఓట్స్
ఎదిగే పిల్లలకు ఓట్స్ చాలా మంచివి. తక్షణ శక్తినివ్వడంలో వీటిలోని పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఫైబర్, కార్బొహైడ్రేట్లు ఓట్స్‌లో ఉంటాయి. ఇవి పిల్లలను ఉత్సాహంగా ఉంచుతాయి. ఓట్స్ లో చెర్రీలు కలిపి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో ఇవ్వవచ్చు.
2. చేపలు
పిల్లలకు వారానికి ఒకసారి అయినా సరే చేపలను తినిపించాలి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి. అందువల్ల మానసికంగా దృఢంగా ఉంటారు.
3. గుడ్లు
పిల్లలకు రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లోనే ఒక ఉడకబెట్టిన గుడ్డును తినిపిస్తుండాలి. గుడ్లు సంపూర్ణ పౌష్టికాహారం. కనుక పిల్లలకు అన్ని పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని పిల్లలకు రోజూ తినిపించాలి.
4. అరటి పండ్లు
చదువుకునే పిల్లలకు జ్ఞాపకశక్తి అవసరం. అది మెరుగు పడాలంటే పొటాషియం ఎక్కువగా అందలే చూడాలి. అరటి పండ్లు, యాప్రికాట్‌లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది చిన్నారులకు మేలు చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వారికి రోజూ ఒక్క అరటి పండును తినిపిస్తే మంచిది.
5. పాలు
పిల్లలకు పాలను రోజూ తాగించాలి. ఇవి కూడా సంపూర్ణ పౌష్టికాహారం కిందకు వస్తాయి. కనుక పిల్లలకు రోజూ పాలను తాగిస్తే అన్ని రకాల పోషకాలు లభిస్తాయి.
ఇవే కాకుండా తాజా పండ్లు, పెరుగు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, నట్స్ ను పిల్లలకు రోజూ తినిపించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎదుగుల సరిగ్గా ఉంటుంది. అన్నింట్లోనూ రాణిస్తారు.