మహిళలకు గర్భం దాల్చడం అనేది గొప్ప వరం లాంటిది. కేవలం మహిళలకు మాత్రమే లభించే గొప్ప అవకాశం. గర్భంలో ఒక జీవిని పెంచి ఈ లోకంలోకి తీసుకువస్తుంది మహిళ. అందువల్ల తల్లీ బిడ్డ ఇద్దరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. ఆ ఆహారాల్లో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలోనే గర్భిణీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలేట్ ఎంతో అవసరం. దీని వల్ల బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. మెదడు సరిగ్గా పనిచేస్తుంది. పుట్టిన తరువాత పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. ఫోలిక్ యాసిడ్‌ను తీసుకోవడం వల్ల పిల్లల్లో పుట్టుకతో లోపాలు రాకుండా ఉంటాయి. గర్భిణీలు ప్రసవించే వరకు రోజూ కచ్చితంగా ఫోలిక్‌యాసిడ్ ఉండే ఆహారాలను లేదా సప్లిమెంట్లను తీసుకోవాలి. రోజుకు వారికి 700 మైక్రోగ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది. ఆకుపచ్చని కూరగాయలు, నిమ్మజాతికి చెందిన పండ్లలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల వీటిని తీసుకుంటే గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ లోపం రాకుండా చూసుకోవచ్చు.
2. గర్భిణీలకు కావల్సిన అనేక పోషకాల్లో ఐరన్ ఒకటి. దీని వల్ల రక్తం సరైన స్థాయిలో ఉంటుంది. బిడ్డకు పోషకాలు సరిగ్గా లభిస్తాయి. గర్భిణీలకు రోజుకు 27 మిల్లీగ్రాముల మేర ఐరన్ కావాలి. అందుకు గాను మాంసం, లివర్, తృణ ధాన్యాలు, ఆకు పచ్చని కూరగాయలు, నట్స్, బీన్స్, డ్రై ఫ్రూట్స్, విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే డాక్టర్ల సూచన మేరకు ఐరన్ సప్లిమెంట్లను వాడవచ్చు.
3. గర్భిణీలకు కావల్సిన ఇంకో పోషకం.. కాల్షియం. ఇది కండరాలు, నాడుల పనితీరుకు, ఎముకల పెరుగుదల, దృఢత్వానికి అవసరం. అందువల్ల గర్భిణీలు రోజూ కాల్షియం ఉండే ఆహారాలను తీసుకోవాలి. రోజుకు వారికి 1000 మిల్లీగ్రాముల మేర కాల్షియం అవసరం అవుతుంది. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, ఆకు పచ్చని కూరగాయలు, చిరు ధాన్యాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది.
4. గర్భిణీలు విటమిన్ డి ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల బిడ్డ రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు 600 ఐయూ మేర విటమిన్ డి కావాలి. విటమిన్ డి వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. డాక్టర్ల సూచన మేరకు గర్భిణీలు విటమిన్ డి ట్యాబ్లెట్లను వేసుకోవచ్చు. అలాగే సూర్య రశ్మిలో గడపడం, గుడ్లు, పాలను తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి లభిస్తుంది.
5. గర్భం దాల్చిన మహిళలు డోకోసాహెగ్జాఓనియిక్ యాసిడ్ (డీహెచ్‌ఏ) ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. ఇది బిడ్డ మెదడు, కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నారింజ పండ్ల రసం, పాలలలో ఇది ఎక్కువగా ఉంటుంది. డాక్టర్లు ట్యాబ్లెట్లను కూడా ఇస్తారు.
6. థైరాయిడ్ గ్రంథుల పనితీరుకు అయోడిన్ అవసరం. రోజుకు గర్భిణీలు 220 మైక్రోగ్రాముల అయోడిన్‌ను తీసుకోవాలి. ఇది చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాల్లో లభిస్తుంది.
7. గర్భిణీలు ప్రోటీన్లు ఉండే ఆహారాలను కూడా రోజూ తీసుకోవాలి. దీని వల్ల బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. కణజాలాలు సరిగ్గా నిర్మాణం అవుతాయి. మరమ్మత్తులకు గురవుతాయి. రోజుకు 71 గ్రాముల ప్రోటీన్లు అందేలా చూసుకోవాలి. ఇవి మాంసం, చేపలు, గుడ్లు, నట్స్, సీడ్స్, సోయా బీన్ తదితర ఆహారాల్లో లభిస్తాయి.
పైన తెలిపిన పోషకాలు ఉండే ఆహారాలను గర్భిణీలు రోజూ తీసుకోవాలి. దీని వల్ల తల్లికి, బిడ్డకు ఆరోగ్యం కలుగుతుంది. పుట్టబోయే బిడ్డలో ఎలాంటి లోపాలు రాకుండా చూసుకోవచ్చు.