Natural Protein Powder : మారిన ఆహారపు అలవాట్లు మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది. నీరసం, నిస్సత్తువ, రోజంతా ఉత్సాహంగా లేకపోవడం, తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడడం, రక్తహీనత వంటి అనేక రకాల సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలు తలెత్తడానికి పోషకాలను కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడమే ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని తీసుకోవడం పాటు మన ఇంట్లోనే ఒక పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ పొడిని చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు ఎవరైనా వాడవచ్చు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ మనం ఆరు రకాల అతి బలమైన రుచికరమైన ఎండు విత్తనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పొడిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్ని లభిస్తాయి. అలాగే దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తెలివి తేటలకు, మేధాశక్తికి గుమ్మడి గింజలు, యవ్వనంగా, ఉత్సాహంగా ఉండడానికి పొద్దు తిరుగుడు గింజలు, ప్రోటీన్లను ఎక్కువగా అందించడానికి పుచ్చ గింజల పప్పు, జుట్టు మరియు శరీరానికి బలం చేకూర్చడానికి బాదం పప్పు, కమ్మటి రుచి కొరకు జీడిపప్పు, పిస్తా పప్పు… ఈ విధంగా ఈ ఆరు రకాల పప్పులను ఉపయోగించి మనం ఈ పొడిని తయారు చేసకోవాల్సి ఉంటుంది.
ఈ పప్పులతో పొడిని చేసుకుని వాడడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఇలా అన్ని రకాల పోషకాలు మనకు లభిస్తాయి. ఈ ఎండిన పప్పులతో రుచికరమైన పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ ఈ పప్పులన్నింటిని సమపాళ్లల్లో తీసుకోవాలి. తరువాత ఒక్కో పప్పును ఒక దాని తరువాత ఒకటిగా కళాయిలో వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత ఈ పప్పులన్నింటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పప్పులన్నింటిని ఒక జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఇందులో తీపి కొరకు ఎండు ఖర్జూరాల పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో వేసుకుని కలుపుకోవాలి.
అలాగే వాసన కొరకు అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక కప్పు గోరు వెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ మోతాదులో వేసుకుని కలుపుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల పోషకాహార లోపం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పొడిని పాలల్లో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో తెలివితేటలు పెరగడంతో పాటు ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది. బయట మార్కెట్ లో మనకు రకరకాల శక్తిని అందించే పొడులు లభ్యమవుతున్నాయి. వాటిని వాడడానికి బదులుగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న ఎండు గింజల పొడిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకోవచ్చు.