Chicken Cheese Balls : సాయంత్రం సమయంలో చాలా మంది అనేక రకాల స్నాక్స్‌ను తింటుంటారు. నూనె పదార్థాలను, బేకరీ ఫుడ్స్‌ను తింటారు. అయితే బయట లభించే వాటిని తినడం ఆరోగ్యానికి హానికరం. కనుక ఇంట్లోనే స్నాక్స్ చేసుకుని తినాలి. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ పొందవచ్చు. అయితే సాయంత్రం సమయంలో తినే స్నాక్స్‌లో చికెన్ చీజ్ బాల్స్ ఒకటని చెప్పవచ్చు. ఇవి రెస్టారెంట్లలోనే మనకు లభిస్తాయి. కానీ కాస్త శ్రమిస్తే వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని చేయడం కూడా సులభమే. చికెన్ చీజ్ బాల్స్ ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ చీజ్ బాల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ కీమా – అర కిలో, గుడ్డు – ఒకటి, కొత్తిమీర – ఒక కట్ట, ఉల్లికాడల తరుగు – ఒక టేబుల్ స్పూన్, ఎండు మిర్చి గింజలు – ఒక టీస్పూన్, గరం మసాలా – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, మైదా – 1 టేబుల్ స్పూన్, నూనె – వేయించేందుకు సరిపడా, చీజ్ క్యూబ్‌లు – ముప్పావు కప్పు, మొక్క జొన్న పిండి – ఒక కప్పు, బ్రెడ్ పొడి – ఒక కప్పు.
చికెన్ చీజ్ బాల్స్ ను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో చికెన్ కీమా, గుడ్డు పచ్చ సొన, ఉల్లికాడల తరుగు, కొత్తిమీర తరుగు, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి గింజలు, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ కలుపుకోవాలి. తరువాత అందులో మైదా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని అరచేయంత వెడల్పుగా చేసి దాని మధ్యలో ఒక చీజ్ క్యూబ్‌ని ఉంచి అంచుల్ని మూసేయాలి. ఇలా అన్నీ చేసుకుని అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒప్పుడు మొక్కజొన్న పిండి, గుడ్డు తెల్లసొన, బ్రెడ్ పొడిని విడివిడిగా పెట్టుకోవాలి. ఒక చికెన్ ఉండని తీసుకుని ముందుగా మొక్కజొన్న పిండిలో, తరువాత గుడ్డు సొనలో, చివరగా బ్రెడ్ పొడిలో దొర్లించి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకుంటే చాలు. దీంతో ఎంతో రుచికరమైన చికెన్ చీజ్ బాల్స్ రెడీ అవుతాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. తరచూ చేసుకునే స్నాక్స్‌కు బదులుగా ఒక్కసారి ఇలా చేసుకుని తినండి. రుచిని ఆస్వాదిస్తారు.