ప్రోటీన్లు ఎక్కువ‌గా ల‌భించే శాకాహార ప‌దార్థాలు ఇవే..!

మాంసాహారం తిన‌డం వ‌ల్ల ప్రోటీన్లు ల‌భిస్తాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్రోటీన్ల‌నే మాంస‌కృత్తులు అని అంటారు. ఇవి స్థూల పోష‌కాల జాబితా కింద‌కు చెందుతాయి. అందువ‌ల్ల నిత్యం వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రోటీన్ల కోసం కేవ‌లం మాంసాహార‌మే తినాల్సిన ప‌నిలేదు. అనేక శాకాహార ప‌దార్థాల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి. వాటిని త‌ర‌చూ తీసుకుంటుంటే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు య‌థావిధిగా అందుతాయి. మ‌రి ప్రోటీన్ల‌ను అందించే ఆ శాకాహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

plant based protein foods

* ఒక క‌ప్పు ఉడ‌క‌బెట్టిన క్వినోవాలో 8 గ్రాముల ప్రోటీన్లు ల‌భిస్తాయి.

* ఒక మీడియం సైజు మొక్క‌జొన్న కంకిలో 4 గ్రాముల వ‌రకు ప్రోటీన్లు ఉంటాయి.

* పావు క‌ప్పు బాదంపప్పులో 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.

* పావు క‌ప్పు జీడిప‌ప్పు ద్వారా 5 గ్రాముల ప్రోటీన్లు ల‌భిస్తాయి.

* ఒక క‌ప్పు ఉడ‌క‌బెట్టిన శ‌న‌గ‌ల్లో 15 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.

* పావు క‌ప్పు గుమ్మ‌డికాయ విత్త‌నాల్లో 9 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.

* ఒక మీడియం సైజు ఉడ‌క‌బెట్టిన ఆలుగ‌డ్డ‌తో 4 గ్రాము ప్రోటీన్లు ల‌భిస్తాయి.

* ఒక క‌ప్పు ఉడ‌క‌బెట్టిన ప‌ప్పు దినుసులు.. అంటే కందిప‌ప్పు, మైసూర్ పప్పు, మిన‌ప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పు వంటి వాటిలో 18 గ్రాముల వ‌ర‌కు ప్రోటీన్లు ఉంటాయి.

* ఒక క‌ప్పు ఉడ‌క‌బెట్టిన బీన్స్ లేదా చిక్కుడు జాతి గింజ‌లు, కూర‌గాయల ద్వారా సుమారుగా 15 గ్రాముల వ‌ర‌కు ప్రోటీన్లు ల‌భిస్తాయి.

క‌నుక ప్రోటీన్ల కోసం మాంసాహార‌మే తినాల‌ని ఏమీ లేదు. పైన తెలిపిన శాకాహార ప‌దార్థాల‌ను తిన్నా ప్రోటీన్లు ల‌భిస్తాయి. ప్రోటీన్ల వ‌ల్ల శ‌రీర నిర్మాణం జ‌రుగుతుంది. కండ‌రాలు దృఢంగా ఉంటాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది.

నిత్యం మ‌నం ప్రోటీన్ల‌ను ఎంత మేర తీసుకోవాల్సి ఉంటుందంటే ?

* 1 నుంచి 3 ఏళ్ల వ‌య‌స్సు వారికి నిత్యం 13 గ్రాముల వ‌ర‌కు ప్రోటీన్లు అవ‌స‌రం.
* 4 నుంచి 8 ఏళ్ల వారు 19 గ్రాముల ప్రోటీన్ల‌ను తీసుకోవాలి.
* 9 నుంచి 13 ఏళ్ల వారికి 34 గ్రాముల ప్రోటీన్లు అవ‌స‌రం అవుతాయి.
* 14 నుంచి 18 ఏళ్ల ‌వ‌య‌స్సు ఉన్న బాలిక‌ల‌కు 46 గ్రాముల ప్రోటీన్లు అవ‌స‌రం.
* 14 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న బాలుర‌కు అయితే 52 గ్రాముల ప్రోటీన్లు అవ‌స‌రం.
* 19 నుంచి 70 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌వారు మ‌హిళ‌లు అయితే రోజుకు 46 గ్రాముల ప్రోటీన్ల‌ను, పురుషులు అయితే రోజుకు 56 గ్రాముల ప్రోటీన్ల‌ను తీసుకోవాలి.

అయితే శ‌రీర బ‌రువు, చేసే పనిని బ‌ట్టి కూడా నిత్యం కావ‌ల్సిన ప్రోటీన్ల మోతాదు మారుతుంటుంది. ఎప్పుడూ కూర్చుని ప‌నిచేసేవారికి త‌క్కువ ప్రోటీన్లు అవ‌స‌రం అవుతాయి. అదే శారీర‌క శ్ర‌మ చేసే వారికి, వ్యాయామం ఎక్కువ‌గా చేసేవారికి ప్రోటీన్లు ఎక్కువ‌గా అవ‌స‌రం అవుతాయి. వీరు నిత్యం కావ‌ల్సిన దాని క‌న్నా కొంచెం ఎక్కువ‌గా ప్రోటీన్ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts