రాత్రి పూట మనం భోజనం చేశాక మరుసటి రోజు ఉదయం వరకు చాలా సమయం వ్యవధి వస్తుంది. దీంతో శరీరం ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. అలాంటి సమయంలో మనం శక్తివంతమైన, పోషకాలు కలిగిన ఆహారాలను తింటే మంచిది. దీంతో శరీరానికి శక్తి, పోషణ లభిస్తాయి. అయితే ఉదయం పరగడుపున తినాల్సిన ఆహారాల్లో కొన్ని అత్యుత్తమమైన ఆహారాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఉదయం చాలా మంది బియ్యంతో పొంగల్ చేసుకుని తింటారు. అయితే బియ్యంకు బదులుగా కొర్రలతో పొంగల్ చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండడమే కాదు, పోషకాలు లభిస్తాయి. ఉదయం కొర్రలతో చేసిన పొంగల్‌ను తింటే డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. కొర్రలు, పొట్టు పెసర పప్పు, అల్లం ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర, కరివేపాకులు, కొత్తిమీర, ఇంగువ, ఉప్పు, నెయ్యి, చిక్కుడు కాయలు, క్యారట్, మెంతి కూర లను వేసి కొర్రలతో పొంగల్ తయారు చేసుకుని తింటే ఎంతో బలం వస్తుంది. అనేక పోషకాలు అందుతాయి. ఇది అత్యుత్తమమైన బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పవచ్చు.
* ఉదయాన్నే రాగి జావ కాచుకుని అందులో నెయ్యి, జీడిపప్పు వేసి తీసుకోవచ్చు.
* రాత్రి పూట అన్నం వండి అందులో కొద్దిగా పాలు పోసి కలిపి మజ్జిగ వేసి పెట్టాలి. మరుసటి రోజు ఉదయం అది చద్దన్నం అవుతుంది. అది ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. ఆ అన్నం కూడా అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు. అందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చి మిర్చి ముక్కలను కలిపి తింటే మంచిది.
* ఉదయం బ్రౌన్ రైస్‌ను అన్నంలా వండుకుని తినవచ్చు. ఇది కూడా మంచి అల్పాహారమే.
* నూనె లేకుండా గోధుమ పిండితో పుల్కాలను కాల్చి అందులోకి శనగల కూర చేసుకుని తింటే మంచిది.
* పరగడుపున మొదట గోరు వెచ్చని నీరు, తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. తరువాత బొప్పాయి, ఆపిల్, జామ, పుచ్చకాయ , కర్భుజా వంటి పండ్లను తినవచ్చు. లేదా డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోవచ్చు.
* ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో మొలకెత్తిన విత్తనాలు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, పండ్లను తినవచ్చు.
ఇవన్నీ పరగడుపున తీసుకోదగిన అత్యుత్తమమైన ఆహారాలు. వీటితో పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి.