క్యాబేజీని తిన‌డం వ‌ల్ల క‌లిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

క్యాబేజీని సాధార‌ణంగా చాలా మంది తిన‌రు. కానీ ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డేవే. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ర‌కాల క్యాబేజీ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఎరుపు, ప‌ర్పుల్‌, వైట్‌, గ్రీన్.. ఇలా భిన్న ర‌కాల రంగుల్లో మ‌న‌కు క్యాబేజీ ల‌భిస్తుంది. మ‌న‌కు గ్రీన్ క‌ల‌ర్ క్యాబేజీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే ఏ రంగు క్యాబేజీ అయినా స‌రే.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌నే అందిస్తుంది.

8 amazing health benefits of cabbage

1. పోష‌కాలు

క్యాబేజీల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఒక క‌ప్పు (89 గ్రాములు) ప‌చ్చి క్యాబేజీని తిన‌డం వ‌ల్ల 22 క్యాల‌రీలు ల‌భిస్తాయి. ప్రోటీన్లు 1 గ్రాము, ఫైబ‌ర్ 2 గ్రాములు, విట‌మిన్ కె 85 శాతం (రోజులో కావ‌ల్సిన దాంట్లో), విట‌మిన్ సి 54 శాతం, ఫోలేట్ 10 శాతం, మాంగ‌నీస్ 7 శాతం, విట‌మిన్ బి6 6 శాతం, కాల్షియం 4 శాతం, పొటాషియం 4 శాతం, మెగ్నిషియం 3 శాతం ల‌భిస్తాయి. దీంతోపాటు చిన్న మొత్తాల్లో విట‌మిన్ ఎ, ఐర‌న్‌, రైబో ఫ్లేవిన్ త‌దిత‌ర పోష‌కాలు కూడా అందుతాయి. అందువ‌ల్ల క్యాబేజీతో మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది.

2. వాపులు

క్యాబేజీలో ఉండే స‌ల్ఫోర‌ఫేన్‌, కాయెంప్‌ఫెరాల్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల క్యాబేజీని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. ముఖ్యంగా రుమ‌టాయిట్ ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది.

3. విట‌మిన్ సి

సాధార‌ణంగా నిమ్మ‌జాతికి చెందిన పండ్లు, బెర్రీలు, కివీలు వంటి వాటిల్లోనే విట‌మిన్ సి ఉంటుంద‌ని అనుకుంటారు. కానీ నిజానికి క్యాబేజీలోనూ విట‌మిన్ సి ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్ప‌త్తిని ప్రోత్స‌హిస్తుంది. కొల్లాజెన్ వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎముక‌లు, కండ‌రాలు, ర‌క్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే చ‌ర్మం సంర‌క్షించ‌బ‌డుతుంది. త‌ర‌చూ క్యాబేజీని ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

4. జీర్ణ ప్ర‌క్రియ

క్యాబేజీలో ఇన్‌సాల్యుబుల్ ఫైబ‌ర్ ఉంటుంది. ఇది జీర్ణాశ‌యానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. జీర్ణ ప్ర‌క్రియ సాఫీగా కొన‌సాగుతుంది.

5. గుండె ఆరోగ్యానికి

ఎరుపు రంగు క్యాబేజీలో ఆంథో స‌య‌నిన్లు అన‌బ‌డే శ‌క్తివంత‌మైన స‌మ్మేళ‌నాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఆంథో స‌య‌నిన్లు అధికంగా ఉండే ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు 93,600 మంది స్త్రీ, పురుషుల‌పై చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

6. హైబీపీ

క్యాబేజీలో పొటాషియం స‌మృద్దిగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. ర‌క్త నాళాల‌ను ప్ర‌శాంత ప‌రుస్తుంది. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. హైబీపీ స‌మ‌స్య ఉన్న వారు త‌ర‌చూ క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

7. కొలెస్ట్రాల్

క్యాబేజీలో సాల్యుబుల్ ఫైబ‌ర్‌, ప్లాంట్ స్టెరాల్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి.

8. విట‌మిన్ కె

క్యాబేజీలో విట‌మిన్ కె స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఒక క‌ప్పు క్యాబేజీని తింటే చాలు రోజులో మ‌న‌కు కావ‌ల్సిన విట‌మిన్ కె లో దాదాపుగా 85 శాతం వ‌ర‌కు ల‌భిస్తుంది. దీంతో ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌కుండా ఉంటుంది. గాయాలు అయిన‌ప్పుడు ర‌క్త స్రావం ఎక్కువ‌గా అవ‌కుండా ఉంటుంది.

Admin

Recent Posts