బీట్‌రూట్‌లను సహజంగానే చాలా మంది తినేందుకు ఇష్ట పడరు. కానీ వీటిలో అనేక ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. బీట్ రూట్‌లను నేరుగా అలాగే పచ్చిగా తినవచ్చు. లేదా నిత్యం జ్యూస్, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నప్పటికీ బీట్‌రూట్ వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వాపులు
బీట్ రూట్‌లలో బీటాలెయిన్స్ అనబడే ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతోపాటు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు నిత్యం బీట్‌రూట్‌లను తినడం వల్ల ఫలితం ఉంటుంది. నొప్పులు తగ్గుతాయి.
2. జీర్ణవ్యవస్థ
బీట్‌రూట్‌లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు బీట్‌రూట్‌లో గ్లూటమైన్, అమైనో యాసిడ్లు, 3.4 గ్రాముల ఫైబర్ ఉంటాయి. దీంతో జీర్ణాశయానికి ఎంతో మేలు జరుగుతుంది. మలబద్దకం సమస్య ఉండదు. ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
3. మెదడు ఆరోగ్యానికి
బీట్‌రూట్‌లలో ఉండే నైట్రేట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. మెదడులో రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. దీంతో మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది.
4. హైబీపీ
బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు హైబీపీని తగ్గించడంలో సహాయ పడతాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
5. యాంటీ క్సాన్సర్ గుణాలు
బీట్‌రూట్‌లను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. ఆ కణాలు వృద్ధి చెందవు. బీట్‌రూట్‌లలో విటమిన్ బి6, సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నిషియం, ప్రోటీన్లు, ఐరన్, ఫాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
బీట్‌రూట్‌ల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఇకపై బీట్‌రూట్‌ను చూసి ముఖం తిప్పేయకండి. బీట్‌రూట్‌ను ఇష్టంగా తినండి. అదే అలవాటు అవుతుంది. నిత్యం దీన్ని పచ్చిగా తిన్నా, జ్యూస్ లా తాగినా ఎక్కువ ఫలితాలను పొందవచ్చు.