Bendakaya : మనం ఆహారంగా అనేక రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో బెండకాయ కూడా ఒకటి. జిగురుగా ఉంటుందన్న కారణంగా దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ బెండకాయలను తినడం వల్ల, బెండకాయ నీటిని తాగడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలను తినడం వల్ల మన శరీరానికి కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయల్లో విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రాత్రి పడుకునే ముందు రెండు బెండకాయలను తీసుకుని శుభ్రం చేసి రెండు చివర్లను తీయాలి. తరవాత వాటిని నిలువుగా చివరి వరకు కత్తితో కట్ చేసి ఒక గ్లాస్ నీటిలో వేయాలి. ఉదయాన్నే బెండకాయలను తీసేసి ఆ నీటిని తాగడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. దీంతో బీపీ వంటి సమస్యలు తగ్గి గుండె పని తీరు మెరుగుపడుతుంది.
ఉదయాన్నే ఈ బెండకాయ నీటిని తాగడం వల్ల ప్రేగులు శుభ్రపడి గ్యాస్, అల్సర్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెండకాయ నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. బెండకాయ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గుతారు. గొంతువాపు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు బెండకాయ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని తరచూ తాగుతూ ఉండడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం.
బెండకాయలను వేపుడుగా కాకుండా పులుసుగా చేసుకుని తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బెండకాయలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు బెండకాయలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి.
అంతేకాకుండా బెండకాయలను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాం. అలాగే తరచూ బెండకాయలను పిల్లలకు ఆహారంగా ఇవ్వడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్వరంతో బాధపడే వారు బెండకాయలను ముక్కలుగా తరిగి నీటిలో వేసి మరిగించాలి. ఈ నీరు చల్లగా అయిన తరువాత వడకట్టుకుని తాగడం వల్ల జ్వరం నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా బెండకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.