(పాత ఫోటో) మొజాంజాహి మార్కెట్లోని కరాచీ బేకరి. కరాచీ నగరం పేరు మీదనే కరాచీ బేకరి పేరు వచ్చింది. 1947లో భారత విభజన జరిగినప్పుడు కరాచీ ప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చిన సింధీ వలసదారుడు ఖాన్ చంద్ రామ్నాని ఈ బేకరిని స్థాపించాడు. 1953లో మొజాంజాహి మార్కెట్ లోని సీనా బేకరి పక్కన హైదరాబాదులోని మొదటి కరాచీ బేకరి ప్రారంభమయింది.
రామ్నాని కరాచీ నుండి వలస వచ్చినందుకు ఆ పేరు మీదనే బేకరిని స్థాపించారు. 2019 పుల్వామా దాడితో పాకిస్తాన్ మీద పెరిగిన వ్యతిరేకత సెగలు కరాచీ బేకరికి కూడా తగిలాయి. కరాచీ పేరు పాకిస్తాన్ కి చెందినది అని, వెంటనే దాని పేరు భారతీయ కరాచీ బేకరిగా మార్చాలని నినాదాలు చేశారు.
వాటిని చల్లార్చడానికి బేకరి ముందు జాతీయ జెండాను ఎగురవేసి వారి దేశభక్తిని చాటుకున్నారు. కరాచీ బేకరి వారసత్వంగా వచ్చిందని, అది పాకిస్థాన్ కి సానుభూతి చూపించదని, విభజన సమయంలో పాకిస్థాన్ లో చెలరేగిన హింస వలన అక్కడినుండి వలస రావలసి వచ్చిందని, భారతీయతకు వ్యతిరేకం కాదని, దాని పేరు ఎట్టి పరిస్థితుల్లో మార్చబోమని స్పష్టం చేశారు.