Ajwain Leaves : మన ఇంటి పెరట్లో పెంచుకోవడానికి వీలుగా, అందంగా ఉండడంతో పాటు అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు కూడా ఉంటాయి. అలాంటి మొక్కల్లో వాము మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఆకులు వాము వాసన వస్తాయి కనుక దీనికి ఆ పేరు వచ్చింది. వాము మొక్క ఆకులు మందంగా చక్కటి వాసన వస్తూ ఉంటాయి. ఈ మొక్క ఆకులను నలిపితే నీరు ఎక్కువగా వస్తుంది. చక్కటి వాసనతో పాటు ఈ మొక్కలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేస్తున్నారు. వాము మొక్క వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాము మొక్క ఆకుల్లో ఉండే కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఆకలిని పెంచడానికి, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వడానికి, ఎంజైమ్ లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో వాము ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే దీనిలో ఉండే థైమాల్, కెర్వకాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియా, వైరస్ లను నశింపజేయడంలో చక్కగా పనికి వస్తాయని చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అదే విధంగా రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను, ట్రై గ్లిజరాయిడ్స్ ను తగ్గించడంలో కూడా ఈ ఆకులు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే బీపీని నియంత్రించడంలో, న్యూమోనియా వంటి శ్వాస సంబంధిత సమస్యల బారిన పడకుండా చేయడంలో కూడా వాము ఆకు సహాయపడుతుంది. వాము ఆకులో ఉండే ప్రోటీన్లు శరీరంలో ఎక్కువగా ఉన్న క్యాల్షియాన్ని గ్రహించి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేయడంలో దోహదపడతాయని నిపుణులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. వాము ఆకును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఇటువంటి అద్భుతమైన ప్రయోజనాలన్నింటని పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
చాలా మంది ఈ వాము ఆకులతో బజ్జీలను వేసుకుని తింటూ ఉంటారు. బజ్జీలతో పాటు ఈ ఆకులను కూరల్లో కూడా వేసుకోవచ్చు. అలాగే మనం తయారు చేసుకుని తాగే వివిధ కషాయాల్లో కూడా తులసి ఆకులతో పాటు ఈ వాము ఆకులను కూడా వేసుకుని కషాయాలను తయారు చేసుకోవచ్చు. అయితే లేత వాము ఆకులను ఉపయోగించడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాము ఆకులే కదా అని తేలికగా తీసి పారేయకుండా వీటిని ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.