Punjabi Bendakaya Masala : మనం బెండకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బెండకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బెండకాయలతో చేసిన కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బెండకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు ఎవరైనా ఈ కూరను సులభంగా తయారు చేసుకోవచ్చు. పంజాబీ ధాబా స్టైల్ లో బెండకాయ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడుగ్గా తరిగిన లేత బెండకాయ ముక్కలు – పావు కిలో, నూనె – 5 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, పసుపు – రెండు చిటికెలు, టమాటాలు – 2.
ధాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలను వేసి వేయించాలి. వీటిని పెద్ద మంటపై కలుపుతూ రంగు మారే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కరివేపాకు వేసి పూర్తిగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి కలపాలి. వీటిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత టమాటాలను పేస్ట్ గా చేసి వేసుకోవాలి. దీనిని మధ్యస్థ మంటపై కలుపుతూ నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి.
తరువాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై మసాలాలన్నీ బెండకాయ ముక్కలకు పట్టే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ధాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలతో ఈ విధంగా చేసిన మసాలా కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బెండకాయలతో చేసే ఇతర వంటకాల కంటే ఈ విధంగా చేసిన మసాలా కూర మరింత రుచిగా ఉంటుంది.