Gorintaku Chettu : స్త్రీలు వారి చేతులకు, పాదాలకు అలంకరణంగా గోరింటాకును పెట్టుకుంటుంటారు. పూర్వ కాలంలో గోరింటాకు చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండేది. గోరింటాకు పెట్టుకున్న చేతులు, పాదాలు చూడడానికి ఎంతో అందంగా కనబడతాయి. అయితే చాలా మంది గోరింటాకును చేతులకు పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తుందని అనుకుంటుంటారు. కానీ గోరింటాకు కూడా ఔషధంగా పనికి వస్తుందని చాలా మందికి తెలియదు. గోరింట చెట్టు ఆకులను తెంచి మెత్తగా నూరి చేతులకు పెట్టుకోవడం వల్ల ఎటువంటి హాని కలగదు. కానీ ప్రస్తుత కాలంలో ఈ గోరింటాకుకు రసాయనాలను కలిపి అమ్ముతున్నారు. చాలా మంది సులువుగా ఉంటుందని వీటినే ఉపయోగిస్తున్నారు. ఇలా రసాయనాలు కలిపిన గోరింటాకును ఉపయోగించడం వల్ల చర్మంపై దురదలు, పొక్కులు, దద్దుర్లు వంటి చర్మ వ్యాధులు వస్తున్నాయి. కనుక వీటిని ఉపయోగించడం మానేసి స్వచ్ఛమైన గోరింటాకును ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గోరింటాకులో ఉండే ఔషధ గుణాలను, గోరింటాకును ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోరింటాకు చెట్టు బెరడు కషాయాన్ని లేదా చూర్ణాన్ని ఉపయోగించి చర్మ వ్యాధులను, మూత్ర రోగాలను, పాండు రోగాన్ని, కాలిన గాయాలను, నోటి పూతను, తలనొప్పి, కణుతులు, వ్రణాలు, జుట్టు సమస్యలను నయం చేసుకోవచ్చు. గోరింటాకుకు, సబ్బును కలిపి మెత్తగా నూరి రాయడం వల్ల దెబ్బ తగలడం వల్ల వచ్చే వాపులు, నొప్పులతోపాటు కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
గోరింటాకును మెత్తగా నూరి చేతులకు, పాదాలకు, పిప్పి గోర్లపై, వేళ్ల మధ్య లేపనంగా రాయడం వల్ల కాళ్ల పగుళ్లు, పిప్పి గోర్ల సమస్య, వేళ్ల మధ్య పగలడం వంటి సమస్యలు తగ్గుతాయి. భవిష్యత్తులో ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. గోరింటాకును నీళ్లు వేయకుండా మెత్తగా నూరి కణుతులపై, గ్రంథులపై ఉంచి కట్టుగా కట్టడం వల్ల కణుతులు, గ్రంథులు తగ్గుతాయి. గోరింటాకును, మాచికాకును, నారింజ ఆకును సమపాళ్లల్లో తీసుకుని మెత్తగా నూరి అరికాళ్లకు రాసుకుంటూ ఉండడం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి.
నీరసాన్ని తగ్గించడంలోనూ గోరింటాకు ఉపయోగపడుతుంది. 5 గ్రా. పచ్చి గోరింటాకును తీసుకుని నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గోరింటాకును చేత్తో బాగా నలిపి వడకట్టి ఆ నీటిని ఉదయం పరగడుపున తాగాలి. ఇలా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల ఎంతటి ఎండలో తిరిగినా నీరసం రాకుండా ఉంటుంది. రక్తం శుభ్రపడుతుంది. శరీరానికి ఎంతో బలం చేకూరుతుంది.
సంభోగ శక్తిని పెంచడంలోనూ గోరింటాకు ఉపయోగపడుతుంది. ముళ్ల గోరింటాకు గింజలను, నాణ్యమైన తేనెతో కలిపి నూరి పురుషులు వారి పురుషాంగానికి లేపనంగా రాసుకుని ఆరిన తరువాత సంభోగం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు నీటిలో నల్లపూస, ముళ్ల గోరింటాకు ఆకులను వేసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత నోటిలో పోసుకుని 5 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా చేయడం వల్ల దంతాలు గట్టిపడతాయి. నోటి పూత సమస్య కూడా తగ్గుతుంది.
ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు గోరింట చెట్టు పూలను తీసుకుని దిండు కింద ఉంచి ఆ దిండుపై కళ్లు మూసుకుని పడుకోవడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. కొందరిలో పుండ్లు పడి ఆ పుండ్లు తగ్గిన తరువాత చర్మం మందంగా గట్టిగా మారుతుంది. అలాంటి వారు తగిన మోతాదులో పచ్చి గోరింటాకును తీసుకుని నూరి రాత్రి పడుకునే ముందు చర్మం పై ఉంచి కట్టుగా కట్టాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం వల్ల చర్మం సాధారణ స్థితికి వస్తుంది.
మొండి చర్మ రోగాలను సైతం నయం చేయడంలో గోరింటాకు సహాయపడుతుంది. లేత గోరింటాకును, గోరింట పువ్వులను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఈ కషాయం గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మొండి చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. ఈ విధంగా గోరింటాకును చేతులకు పెట్టుకోవడమే కాకుండా దీనిని ఉయోగించి అనేక అనారోగ్య సమస్యలను కూడా నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.