Thangedu : మన ఇంట్లో, ఇంటి పరిసరాలల్లో అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉండనే ఉంటాయి. వీటిని సరిగ్గా ఉపయోగించాలే కానీ హాస్పిటల్స్ కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. మన ఇంటి పరిసరాలల్లో ఉంటూ ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో తంగేడు మొక్క ఒకటి. ఇది ఎక్కువగా గ్రామాలలో, బీడు భూములలో పెరుగుతూ ఉంటుంది. తంగేడు పువ్వులను బతుకమ్మ పూలు అని కూడా అంటారు. తెలుగు వారందరికీ ఈ పూలు ఎంతో సుపరిచితం. ఈ పూలతో బతుకమ్మలను తయారు చేసి దేవతగా భావించి పూజిస్తారని కూడా మనందరికీ తెలుసు. అంతే కాకుండా తంగేడు చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుందని, మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే శక్తి కూడా ఈ చెట్టుకు ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ చెట్టులో ప్రతి భాగం కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అతి మూత్ర వ్యాధిని నివారించడంలో తంగేడు చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ చెట్టు బెరడును నీడలో ఎండబెట్టి పొడి చేసి సమ పాళ్లల్లో నువ్వుల పొడిని కూడా కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా 40 రోజుల పాటు తినడం వల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది. తంగేడు పూల రెక్కలను ఏవిధంగా తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి తగ్గుతుంది. తంగేడు పూల రెక్కలను మినప పప్పు, పెసర పప్పుతో కలిపి కూర చేసుకుని తినడం వల్ల షుగర్ వ్యాధి, అతి మూత్ర వ్యాధి కూడా నియంత్రించబడతాయి.
చారు లేదా టీ లను తయారు చేసేటప్పుడు ఈ పూల రెక్కలను వేసి మరిగించి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కళ్లు తిరగడం, నీరసం, గుండె దడ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తంగేడు చెట్టు గింజలను పొడిగా చేసి టీ, కాఫీ, చారు వంటి వాటిలో వేసి కలిపి తీసుకోవడం వల్ల లేదా నేరుగా తీసుకున్నా కూడా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.
పార్శ్వపు తలనొప్పితో బాధపడే వారు తంగేడు చెట్టు ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో కళ్లకు, కణతలకు బాగా ఆవిరి పటట్డం వల్ల తలనొప్పి తగ్గుతుంది. తంగేడు ఆకులను మెత్తగా నూరి కట్టుగా కట్టడం వల్ల ఎముకలు విరగడం వల్ల, బెణకడం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి. ఈ చెట్టు లేత ఆకులను నోట్లో వేసుకుని నమలడం వల్ల నోటి పూత సమస్య తగ్గుతుంది. మగ వారిలో వీర్య కణాల సంఖ్యను పెంచే శక్తి కూడా తంగేడు చెట్టుకు ఉందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.