ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండడాన్ని డయాబెటిస్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1, టైప్ 2 అని రెండు రకాల డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అలాగే ప్రి డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్ అని ఇంకో రెండు రకాలు ఉన్నాయి. వంశ పారంపర్యంగా టైప్ 1 డయాబెటిస్ వస్తే, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ వచ్చే ముందు ఉండే స్థితిని ప్రీ డయాబెటిస్ అంటారు. జెస్టేషనల్ డయాబెటిస్ గర్భం దాల్చిన మహిళల్లో కొంత కాలం మాత్రమే ఉంటుంది. అయితే టైప్ 1, 2 డయాబెటిస్‌లు రెండూ అత్యంత ముఖ్యమైనవి.
డయాబెటిస్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే స్థూలకాయం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆ స్థాయికి చేరుకుంటే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి. అయితే రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇక డయాబెటిస్ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవచ్చా ? అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆ సందేహాలకు వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవచ్చు. కాకపోతే కొవ్వు లేని వాటిని తీసుకోవాలి. అంటే వెన్న తీయబడిన పాలు తాగవచ్చు. దాంతో తయారు చేసిన పెరుగు తినవచ్చు. దీంతో శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. పైగా పాలు, పెరుగులలో ఉండే పోషకాలు, ప్రోటీన్లు డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి.
వెన్న తీసిన పాలను రోజుకు 1-2 గ్లాసులు తాగవచ్చు. అదే పెరుగు అయితే 1-2 కప్పులు తీసుకోవచ్చు. అంతకు మించి వాటిని తీసుకోరాదు. ఇక మజ్జిగ రూపంలో అయితే 3 గ్లాసులు తాగవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలను, పిండి పదార్థాలను తగ్గించాలి. దీంతో డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365