భారతీయులకు పసుపు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఇది అల్లం కుటుంబానికి చెందిన మసాలా పదార్థం. భారత ఉపఖండంతోపాటు, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో పసుపును ఎక్కువగా పండిస్తారు. పసుపు వేర్లను సేకరించి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి వాటి నుంచి పొడిని తయారు చేస్తారు. దాన్నే పసుపు అని పిలుస్తారు. పసుపు అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. అందాన్ని పెంచడానికి, గాయాలను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఆయుర్వేదం ప్రకారం పసుపు చాలా శక్తివంతమైన పదార్థం. అందులో యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. దీన్ని అనేక శాకాహారాలతోపాటు మాంసాహార వంటకాల్లోనూ వాడుతుంటారు. భారతీయులు పసుపును రోజూ వాడుతారు. వంటి ఇంటి మసాలా పదార్థంగా పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది భారతీయులందరి ఇళ్లలోనూ ఉంటుంది. అయితే పసుపును వంటల్లో వేసి ఉడికించాలా లేదా దాని ప్రయోజనాలను పొందేందుకు నేరుగా తీసుకోవాలా ? అని కొందరికి సందేహాలు వస్తుంటాయి. ఆ సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి కనుక పసుపును తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పసుపులో కర్కుమినాయిడ్స్ అని పిలవబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి 1 నుంచి 6 శాతం వరకు ఉంటాయి. వీటివల్లే పసుపుకు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. కర్కుమినాయిడ్స్‌తో పాటు పసుపులో 34 రకాల ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి పసుపు ఔషధ గుణాలను పెంచుతాయి. దీని వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆర్థరైటిక్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్ రాకుండా చూస్తుంది.
మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్ విభాగం నిర్వహించిన పరిశోధన ప్రకారం..పసుపును ఎక్కువ సమయం పాటు వంటల్లో ఉడకబెట్టడం వల్ల అందులో ఉండే కర్కుమిన్ సమ్మేళనాల శాతం తగ్గుతుంది. పసుపును వంటల్లో వేసి వండడం వల్ల అందులో ఉండే కర్కుమిన్ మీద వేడి ప్రభావం మూడు వేర్వేరు పరిస్థితులలో పరిశోధకులు గమనించారు- 10 నిమిషాలు సమ్మేళనాలు ఎలా తగ్గుతాయి అనే అంశాన్ని వారు పరిశీలించారు. ఇందులో భాగంగానే వారు పసుపును వంటల్లో వేసి 20 నిమిషాల పాటు ఉడకబెట్టడం, 10 నిమిషాల పాటు ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించడం వంటి ప్రయోగాలు చేశారు.
వేడి చేయడం వల్ల పసుపులో సుమారుగా 27 నుంచి 53 శాతం వరకు కర్కుమిన్ పోయిందని అధ్యయన ఫలితాలు తెలిపాయి. అయితే వేడి చేసే సమయంలో పసుపుతో పుల్లని పదార్థాలు ఉన్నప్పుడు కర్కుమిన్ నష్టం 12 నుండి 30 శాతం వరకు తగ్గిందని గుర్తించారు. అంటే పసుపును వంటల్లో వేసి ఉడికించేట్లయితే దాంతోపాటు చింతపండు లాంటి పుల్లని పదార్థాలను వేయాలి. దీంతో కర్కుమిన్ నష్టం తగ్గుతుంది.
కన్సల్టింగ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రూపాలి దత్తా మాట్లాడుతూ.. పసుపును వంటల్లో వేసి ఎక్కువ సేపు ఉడికిస్తే కర్కుమిన్‌ను నష్టపోతారు. అందువల్ల వంట చివర్లో పసుపు వేయాలి. లేదా పసుపును నేరుగా తీసుకోవచ్చు. దాన్ని గోరు వెచ్చని పాలలో కలిసి తీసుకోవచ్చు. దీంతో పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనాలను కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చు. అవి మన శరీరానికి లభిస్తాయి.. అని అన్నారు.
అధ్యయనం సూచిస్తున్న ప్రకారం.. వంటల్లో పసుపును ముందుగానే వేయరాదు. ఎక్కువ సేపు పదార్థాలను ఉడికిస్తారు కాబట్టి వాటితో పసుపు కూడా ఉడుకుతుంది. దీంతో అందులో ఉండే సమ్మేళనాలను కోల్పోతాం. కనుక వంట చివర్లో పసుపు వేయాలి. చింతపండు వంటి పుల్లని పదార్థాలను వంటల్లో వేస్తే పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనాలను కొంత వరకు నష్టపోకుండా అడ్డుకోవచ్చు. ఇక వంటల చివర్లో లేదా భోజనం చేసేటప్పుడు పదార్థాలపై పసుపు చల్లుకుని తినాలి. లేదా పాలలో పసుపు కలిపి తీసుకోవచ్చు. దీంతో పసుపులో ఉండే కర్కుమినాయిడ్స్ శరీరానికి లభిస్తాయి. వాటి వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365