Heart Beat : మన శరీరంలోని అనేక అవయవాల్లో గుండె ఒకటి. ఇది ఎవరికైనా సరే సాధారణంగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. ఇక చిన్నారుల్లో అయితే గుండె నిమిషానికి ఏకంగా 120 సార్లు కొట్టుకుంటుంది. ఇది సహజమే. కానీ కొందరు తమకు భోజనం చేశాక గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుందని.. దీనికి కారణం ఏమై ఉంటుందబ్బా.. అని ఆందోళన చెందుతుంటారు. అయితే ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం రోజూ అనేక రకాల పనులు చేస్తుంటాం. అనేక రకాల పానీయాలను, ఆహారాలను తీసుకుంటుంటాం. దీనికి మనకు భిన్న రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే మనం భిన్న రకాల వాతావరణ పరిస్థితుల్లో జీవిస్తుంటాం. ఇవన్నీ మన గుండె కొట్టుకునే వేగంపై ప్రభావం చూపిస్తాయి. ఇక సాధారణంగా మద్యం సేవించినా.. పొగ తాగినా.. టీ, కాఫీలు తాగినా.. ఒత్తిడి, అలసట అధికంగా ఉన్నా.. నిద్ర సరిగ్గా పోకపోయినా.. పీడకలలు వచ్చినా.. మన గుండె కాస్త ఎక్కువ వేగంతో కొట్టుకుంటుంది.
అయితే ఇవే కాకుండా భోజనం చేసిన తరువాత కూడా మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది అందరిలోనూ సహజంగానే జరిగే ప్రక్రియ. కానీ కొందరికి ఇలాంటి సమయంలో కాస్త ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది. అందుకు కారణం.. జీర్ణవ్యవస్థలో చేరిన ఆహారాన్ని జీర్ణం చేసేందుకు శరీరం ఆ భాగంలో రక్త సరఫరాను పెంచుతుంది. దీంతో సహజంగానే బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుంది. దీని వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అయితే జీర్ణ సమస్యలు ఉన్నవారిలో జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఉంటుంది. కనుక శరీరం సరఫరా చేసే రక్తం సరిపోక ఇంకాస్త ఎక్కువ సరఫరా కావల్సి వస్తుంది. దీంతో ఆ రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండెపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ పెరిగి రక్తం సరఫరా అవుతుంది. దీంతో ఇతరుల కన్నా వీరిలో గుండె కాస్త ఎక్కువ వేగంతో కొట్టుకుంటుంది. కనుకనే వారికి గుండె బాగా వేగంగా కొట్టుకోవడం తెలుస్తుంది. కాబట్టే భోజనం చేశాక కొందరు తమ గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుందని అంటుంటారు. ఇది సహజమే.
అయితే ఇలా సాధారణం కన్నా ఎక్కువ వేగంతో గుండె కొట్టుకునే వారు కాస్త జాగ్రత్తగానే ఉండాలి. సమస్య కేవలం భోజనం చేసినప్పుడు మాత్రమే ఉంటే అప్పుడు జీర్ణ సమస్యలు ఉన్నట్లు భావించాలి. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా.. భోజనం చేసినా.. చేయకపోయినా.. తరచూ ఇలా గుండె వేగంగా కొట్టుకుంటుందంటే.. అప్పుడు అప్రమత్తం అవ్వాలి. వెంటనే డాక్టర్‌ను కలసి గుండె పరీక్షలు చేయించుకోవాలి. దీంతో ఏదైనా సమస్య ఉంటే వెంటనే తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే డాక్టర్ చే చికిత్స తీసుకోవచ్చు. దీని వల్ల గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్ లు రాకుండా ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.