పండ్లు, పండ్ల రసాలు.. వీటిని ఏ సమయంలో తీసుకుంటే మంచిది ?

పండ్లు లేదా పండ్ల రసాలు.. ఏవైనా సరే.. నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. పండ్లు, పండ్ల రసాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. అలాగే శక్తి కూడా లభిస్తుంది. అయితే వాటిని సరైన సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే పండ్లను, పండ్ల రసాలను ఏయే సమయాల్లో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

what is the best time to take fruits and fruit juices

సాధారణంగా చాలా మంది పండ్ల రసాలను ఎప్పుడు పడితే అప్పుడు తాగుతారు. ఇక వేసవి వచ్చిందంటే చాలు కొందరు అదే పనిగా రోజూ పండ్ల రసాలను తాగుతారు. అయితే అది మంచిది కాదు. ఎందుకంటే పండ్లతో పోలిస్తే పండ్ల రసాల్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాటిని తాగగానే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక పండ్ల రసాలను ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. కేవలం నిర్దిష్ట సమయాల్లోనే తాగాల్సి ఉంటుంది.

శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు, నిత్యం వ్యాయామం చేసే వారు ఆ పనుల తరువాత పండ్ల రసాలను సేవించవచ్చు. దీంతో శరీరంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతుంది. వారు పండ్ల రసాలను తాగినా షుగర్‌ లెవల్స్‌ పెరగవు. శక్తిని శరీరం వినియోగించుకుంటుంది. కనుక ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి కేవలం శారీరక శ్రమ చేసేవారు మాత్రమే పండ్ల రసాలను తాగితే మంచిది. వారు కాకుండా చిన్నారులు, గర్భిణీలు, వ్యాధిగ్రస్తులు కూడా పండ్ల రసాలను సేవించవచ్చు.

ఇక పండ్లను వీలైనంత వరకు మధ్యాహ్నం భోజనం లోపే తింటే మంచిది. కుదరకపోతే సాయంత్రం స్నాక్స్‌కు బదులుగా వాటిని తినాలి. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత 2 గంటల విరామం ఇచ్చి పండ్లను తినవచ్చు. పండ్లు పండ్ల రసాల్లా కాదు. వాటిని తినగానే చక్కెర స్థాయిలు పెరగవు. కనుక ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు పండ్లను తినేందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి. పండ్లను తిన్నాక వెంటనే భోజనం చేయరాదు. భోజనం చేసిన వెంటనే పండ్లను తినరాదు. తింటే అజీర్ణం, గ్యాస్‌ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

పండ్లను కూరగాయల జ్యూస్‌లతో కలిపి తీసుకోవచ్చు. దీంతో శరీరం శుభ్రంగా మారుతుంది. ముఖ్యంగా లివర్‌లోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. పాలకూర, యాపిల్‌, నారింజ, అల్లం రసం, కొద్దిగా ఉప్పు కలిపి జ్యూస్‌లా చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. పండ్లను సలాడ్‌ రూపంలోనూ తీసుకోవచ్చు. ఉదయాన్నే బాదంపప్పు, వాల్‌నట్స్‌, కోడిగుడ్లు వంటి వాటితో కలిపి పండ్లను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

ఫైబర్‌ ఎక్కువగా ఉండే యాపిల్‌, నారింజ, జామకాయలు, బొప్పాయి వంటి పండ్లను తరచూ తింటే మంచిది. అలాగే బెర్రీలు, అరటి పండ్లు, మామిడికాయలు వంటి పండ్లను తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. వారంలో వీటిని రెండు సార్లు తీసుకోవచ్చు. కానీ ముందు తెలిపిన పండ్లను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అనేక పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు.

Admin

Recent Posts