గడ్డం పెంచడం అంటే ఒకప్పుడు పురుషులంతా ఓల్డ్ ఫ్యాషన్ అనుకునే వారు. తాతలు గడ్డాలు పెంచేవారు, ఇప్పుడు మనకెందుకులే నీట్‌గా షేవ్ చేసుకుందాం.. అని గతంలో చాలా మంది ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. గడ్డం ఫ్యాషన్ ఐకాన్‌గా మారింది. గడ్డం బాగా పెరిగితే నలుగురిలో ఆకర్షణీయంగా కనిపిస్తారనే ఉద్దేశంతో చాలా మంది గడ్డాలు పెంచుతున్నారు. అలాగే కొత్త కొత్త బియర్డ్ స్టైల్స్‌ను అనుసరిస్తున్నారు. అయితే ఫ్యాషన్ సంగతి అటుంచితే.. నిజంగా గడ్డం పెంచడం అంత ఆరోగ్యకరం కాదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
స్విట్జర్లాండ్‌కు చెందిన కొందరు సైంటిస్టులు ఇటీవలే పరిశోధనలు చేశారు. గడ్డం బాగా ఉన్న 18 మంది పురుషులు, 30 కుక్కలపై ప్రయోగం చేశారు. ఈ క్రమంలో సైంటిస్టులకు తెలిసిందేమిటంటే… పురుషులకు ఉన్న ఆ గడ్డంలో బాక్టీరియా బాగా ఉందట. అది ఎంతలా అంటే.. ఒక కుక్క శరీరంపై ఉండే వెంట్రుకల్లోని బాక్టీరియా కన్నా.. ఒక పురుషుడి గడ్డంలో ఉండే బాక్టీరియానే ఎక్కువని సైంటిస్టులు తేల్చారు.
అంటే కుక్క వెంట్రుకలలో ఉండే బాక్టీరియా కన్నా పురుషుల గడ్డంలో ఉండే బాక్టీరియానే ఎక్కువన్నమాట. అలాగే ఎంత ఎక్కువ గడ్డం ఉంటే అంత ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. కనుక గడ్డం బాగా పెంచుకునే వారు జాగ్రత్త. నీట్‌గా షేవ్ చేసుకునే ఉపాయం ఆలోచించండి. లేదంటే బాక్టీరియా కారణంగా అనారోగ్యాల పాలవుతారు..!