డయాబెటీస్ వ్యాధిని సరిగ్గా నియంత్రించుకోని మహిళలకు వయసు పైబడుతున్న కొద్ది వినికిడి లోపిస్తుందని ఒక తాజా స్టడీ వెల్లలడించింది. డెట్రాయిట్ లోని హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్ రీసెర్చర్లు ఈ అంశంలో 60 నుండి 75 సంవత్సరాల వయసు మధ్యగల మహిళా డయాబెటిక్ రోగులను పరిశోధించారు. అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ సర్వే మేరకు అమెరికాలో సుమారు 26 మిలయన్లమంది షుగర్ వ్యాధిగ్రస్తులున్నారని వీరితో కూడా చేరి షుమారు 34.5 మిలియన్ల జనాభా వినికిడి సమస్యకు గురయ్యారని తెలుస్తోంది.
పెద్ద పెద్ద సమావేశాలలో ప్రసంగాలను వినలేకపోవడం, రేడియో, టి.వి. మొదలైనవాటిలో అవసరాన్ని మించిన ధ్వని పెట్టుకుంటేగాని వినలేకపోవడం, కొన్ని మార్లు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ధ్వనులు వినపడకపోవడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని, అయితే ఈ సమస్యలు పురుషులు డయాబెటిక్ రోగులైనప్పటికి వారిలో లేవని, మహిళలకు మాత్రమే ఈ సమస్య ఏర్పడుతోందని హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్ లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఓటోలారింగాలజీ అధినేత, రీసెర్చర్ ఢెరెక్ జె హేంజో వెల్లడించారు.
షుగర్ వ్యాధిగల మహిళలు ప్రత్యేకించి 60 సంవత్సరాల వయసు పైబడినవారు తమ శరీరంలోని గ్లూకోజ్ స్ధాయిలను ఎప్పటికపుడు వైద్యవిధానాలతో నియంత్రించుకోవాలని లేదంటే ఈ సమస్య ఇతరులతో పోలిస్తే వేగంగా అనేక రెట్లు పెరగగలదని రీసెర్చర్లు వివరించారు.