యూఎస్‌బీ (USB). దీని పూర్తి పేరు యూనివర్సల్ సీరియల్ బస్ (Universal Serial Bus). ఒకప్పుడు దీన్ని కేవలం కంప్యూటర్లలో మాత్రమే వాడేవారు. కానీ తరువాతి కాలంలో దీనికి అనేక వెర్షన్లు వచ్చాయి. ఫలితంగా ఫోన్లలో మైక్రో యూఎస్‌బీ పోర్టును వాడుతున్నారు. ఇక కంప్యూటర్లలో యూఎస్‌బీ పోర్టు ఉపయోగం ఏమిటో అందరికీ తెలుసు. మౌస్‌లు, కీబోర్డులు, ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌లు, పెన్ డ్రైవ్‌లు, ప్రింటర్లు… ఇలా అనేక రకాల డివైస్‌లను కనెక్ట్ చేసుకునేందుకు కంప్యూటర్లలో యూఎస్‌బీ పోర్టులు ఉపయోగపడతాయి. అయితే మీరెప్పడైనా యూఎస్‌బీ కేబుల్స్ లేదా ఆ పోర్టు ఉన్న డివైస్‌లపై ఒకసారి ఆ పోర్టుల వద్ద, కేబుల్స్‌పై జాగ్రత్తగా పరిశీలించారా..? వాటిని గమనిస్తే ఓ చిత్రం మనకు కనిపిస్తుంది. ప్రతి యూఎస్‌బీ డివైస్ కేబుల్ లేదా, పోర్ట్ వద్ద ఈ బొమ్మ ఉంటుంది. మరి దీని అర్థం ఏమిటో మీకు తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం.
యూఎస్‌బీ పోర్టు లేదా కేబుల్‌పై ఉండే పైన ఇచ్చిన బొమ్మకు కరెక్ట్ అర్థం ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. కానీ దానికి వెనుక ఉన్న రెండు కారణాలను మాత్రం చాలా మంది చెబుతున్నారు. అవేమిటంటే… ఒకప్పుడు కంప్యూటర్లలో మౌస్, కీబోర్డు, ప్రింటర్ వంటి వస్తువులకు వివిధ రకాల పోర్టులు ఉండేవి. కానీ యూఎస్‌బీ వచ్చాక అన్నింటికీ ఒకే పోర్టు ఫిట్ అయింది. దీంతో అన్నింటికీ కరెక్ట్‌గా సూటయ్యే పోర్ట్ ఇది అని చెప్పడం కోసమే ఈ చిత్రాన్ని వాడుకలోకి తెచ్చినట్టు తెలుస్తోంది.
ఇక యూఎస్‌బీ బొమ్మ అలా ఉండడానికి మరో కారణం ఏమిటంటే… అందులో ఉన్న వృత్తం, బాణం, చతురస్ర ఆకారాలు వివిధ అంశాలను ప్రతిబింబిస్తాయి. యూఎస్‌బీ బొమ్మలో ఉండే బాణం ఆకారం సీరియల్ డేటాను సూచిస్తుంది. అంటే కంప్యూటర్లు 0, 1 అంకెల రూపంలో డేటాను తీసుకుంటాయి కదా, అందుకు ప్రతిరూపంగా బాణాన్ని వేశారన్నమాట. ఇక యూఎస్‌బీ బొమ్మలో ఉన్న వృత్తం 5V (5 వోల్టులు) పవర్‌ను సూచిస్తే, చతురస్రం గ్రౌండ్ వోల్టేజ్‌ను సూచిస్తుంది. అంటే యూఎస్‌బీ కేబుల్స్‌లో పవర్ కూడా ప్రసారమవుతుంది. కనుకనే అలా ఇచ్చారు. ఇవీ… యూఎస్‌బీ బొమ్మ అలా ఉండేందుకు గల కారణాలు..!