ధ్యానం అనేది మనస్సుకు ఒక మంచి వ్యాయామం, దీనిలో మనం ఆధ్యాత్మిక స్వయం లేదా ఆత్మతో అనుసంధానం అయ్యి ఆత్మ యొక్క సుగుణాలను అనుభూతి చేసుకుంటాము. అలాగే, ధ్యానంలో మనం భగవంతుడు అనగా పరమాత్మతో అనుసంధానం అయ్యి వారి సుగుణాలను పొందుతాము. మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే, అంత సానుకూలంగా, స్వచ్ఛంగా, శక్తివంతంగా తయారవుతాము. మన ఆలోచనలు, భావాలు, వైఖరులు అపారమైన సానుకూల మార్పులకు లోనవుతాయి. ధ్యానం మన మానసిక రోగనిరోధక శక్తిని, అంతర్గత బలాన్ని పెంచుతుంది. అలాగే, జీవితంలోని వివిధ ప్రతికూల పరిస్థితుల నుండి మనల్ని రక్షిస్తుంది. ఆత్మను, పరమాత్మను మరింతగా కనుగొనడానికి, ఆ ఇరువురూ దగ్గరగా రావడానికి, వారితో అందమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కూడా ఇది మనకు వీలు కల్పిస్తుంది.
మనం క్రమం తప్పకుండా ధ్యానం చేసినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కూడా సులభం అవుతుంది. ధ్యానం మనల్ని ఆధ్యాత్మిక జ్ఞాన స్వరూపంగా చేస్తుంది. మనం కొత్త లేదా సృజనాత్మక ఆలోచనా విధానాలను నేర్చుకుంటాము, దైహిక స్మృతి ఆధారంగా ఉన్న మన విశ్వాస వ్యవస్థలు ఆత్మిక స్మృతి ఆధారంగా మారుతాయి. ధ్యానం అనేది ప్రస్తుత సమయంలో భగవంతుడు మనకు అందించే బహుమతి. వారు స్వయంగా మనకు దాని సాంకేతికతను బోధిస్తారు, తద్వారా ఆత్మలమైన మనం ఉన్నతంగా అవుతూ జీవితంలో కొత్త వాస్తవాలను సృష్టిస్తాము. ఈ కొత్త వాస్తవాలు మన ఇళ్లలో, ఆఫీస్ లలో, జీవితంలోని ప్రతి ఇతర రంగంలో శాంతి, ప్రేమ, ఆనందంతో నిండిన చిన్న స్వర్గాలు.
మన మానసిక, శారీరక ఆరోగ్యం మరింత అందంగా మారుతుంది, మన అంతర్గత, బాహ్య వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ప్రతి చర్యలో మన సామర్థ్యం, ఖచ్చితత్వం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా, మన సంబంధాలు సంఘర్షణలు లేకుండా, ఆశీర్వాదాలు, గౌరవం, సహకారంతో నిండి ఉంటాయి. మనం మరింత నిజాయితీ, స్వచ్ఛత, విజయంతో సంపదను సంపాదించడం ప్రారంభిస్తాము.