ఆఫీసులో యోగానా? అని ఆశ్చర్యపోకండి. యోగా అంటే సూర్యనమస్కారాలు వంటివే కాదు. ఎక్కడ వున్నప్పటికి సౌకర్యంగా కొన్ని యోగా భంగిమలు ఆచరించవచ్చు. ఆఫీసుల్లో ఎంతో ఒత్తిడి. ఈ ఒత్తిడినుండి బయటపడాలంటే కొన్ని మార్లు యోగా ఆచరించకతప్పదు. యోగాకు సంబంధించి ఇతరులకు ప్రదర్శించకుండానే మీకు మీరే ఒత్తిడి తగ్గించుకునే కొన్ని మెళుకువలు పరిశీలించండి. సరైన ధ్యాన భంగిమ – తలతో సహా కుర్చీలోనే వెనక్కు వాలండి. కళ్ళు మూసి ధ్యానంలో వుండండి.అయితే నిద్ర మాత్రం పోకండి.
వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోవడం, కాళ్ళు ఒకదానిపై మరొకటి క్రాస్ చేసి కూర్చోవడం, చేతులు రెండూ మీ తొడలపై పెట్టడం కళ్ళు మూసి ధ్యానించడం. ఈ భంగిమ కొద్దిపాటి సౌకర్యం వున్న ఏ ప్రదేశంలోనైనా చేయవచ్చు. ఈ రకంగా 5 నిమిషాలు కూర్చుంటే చాలు మీకు ప్రశాంతత లభిస్తుంది. మెడ వ్యాయామం – కంప్యూటర్ పని చేస్తుంటే, మెడ నొప్పి సహజం. తిన్నగా కూర్చోండి లేదా నిలబడండి. చేతులు తొడలపై పెట్టండి. మీ గడ్డాన్ని ఛాతీకి తగిలేలా వంచి భుజాల వైపుగా ఎడమకు, కుడికి తిప్పండి.
చేతి మణికట్టు – చేతి మణికట్టు ఎడమనుండి కుడికి, కుడినుండి ఎడమకు తిప్పుతూ దాని బిగువును సడలించండి. కీ బోర్డు పై పని చేసే వారికి ఇది మరింత అవసరం. శ్వాస పీల్చటం, వదలటం వంటివి చేస్తే మీలో వున్న ఒత్తిడి అంతా తీసేసినట్లు మాయం అవుతుంది. శరీరంలోకి ఆక్సిజన్ అధికంగా వెళ్ళి శరీరం తేలికగా వుంటుంది. వీపు నిటారుగా పెట్టండి, కాళ్ళు ఒకదానిపై మరొకటి మడిచి పెట్టండి. చేతులు పొట్టమీద పెట్టి గాఢంగా ముక్కుతో శ్వాస పీల్చటం, నోటితో బయటకు వదలటం వంటివి చేసి ఒత్తిడి తగ్గించుకోండి. ఆఫీసులోనే ఈ రకమైన యోగా చేసి ఎంతో హాయి భావించవచ్చు.