ప్రాణాయామంలో అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో కపాలభాతి ప్రాణాయామం ఒకటి. దీన్ని చేయడం సులభమే. శ్వాస మీద పూర్తిగా ధ్యాసను ఉంచాలి. ఈ ప్రాణాయామాన్ని రోజూ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
1. ధ్యానం చేసినట్లు పద్మాసనంలో కూర్చోండి.
2. కళ్లు మూసుకుని ప్రశాంతంగా మారండి.
3. రెండు నాసికా రంధ్రాలతో సుదీర్ఘమైన శ్వాస పీల్చండి.
4. ఛాతిని విస్తరించండి.
5. పొట్ట నుంచి బయటకు తీసినట్లుగా గాలిని బలవంతంగా రెండు నాసికా రంధ్రాల ద్వారా బయటకు వేగంగా పంపండి.
6. అలాగే వేగంగా గాలి పీలుస్తూ బలంగా వదులుతూ ఉండండి.
7. ఈ విధంగా 30 సార్లు చేయాలి.
8. చివరకు లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. దీంతో ఒక రౌండ్ పూర్తవుతుంది. ఇలా ఇంకో రెండు సార్లు చేయాలి. అంటే మొత్తం 90 సార్లు గాలిని పీల్చి వదలాలన్నమాట. ఒక్కో రౌండ్ చివర్లో లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. ఇలా కపాలభాతి చేయాలి.
కపాలభాతి చేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఉదయం పరగడుపున కపాలభాతి చేయాలి. ముక్కు నుంచి రక్తస్రావం అయ్యే సమస్య ఉన్నవారు, మైగ్రేన్, స్ట్రోక్, వికారం, హైబీపీ, తలతిరగడం, హెర్నియా, అల్సర్లు, ఎపిలెప్సీ ఉన్నవారు కపాలభాతి చేయరాదు.