Jogging : ప్రతి ఉదయం నిద్ర లేచాక జాగింగ్ గురించే ఆలోచిస్తారు చాలా మంది. 30 నిమిషాల పాటు చేసే ఈ జాగింగ్ ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. జాగింగ్ వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొవ్వు కరిగించడంలో జిమ్‌లు, డాక్టర్లు చేయలేని పని జాగింగ్ చేయగలదు. ప్రతి ఉదయం మూడు కిలో మీటర్లు జాగింగ్ చేయడం వల్ల ఎముకలు, కండరాలు ఫిట్ గా తయారవుతాయి. మూడు నెలలు క్రమం తప్పకుండా జాగింగ్ చేస్తూ, హెల్దీ డైట్ అనుసరిస్తే ఏడు నుంచి పది కిలోల బరువు తగ్గడం ఖాయం.
2. జాగింగ్ తో మానసిక ఒత్తిళ్లు సైతం పరారవుతాయి. జాగింగ్ చేసే ఓపిక లేకపోతే మాములుగా అయినా నడవవచ్చు.. ఉదయపు నడకతో రక్త కణాలు చురుకుగా కదులతాయి. దీంతో మెదడుకు రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. మెరుపు లాంటి ఆలోచనలు కలుగుతాయి. రక్త సరఫరా మెరుగవ్వడం వల్ల హైపర్ టెన్షన్, గుండెకు సంబంధించిన అనారోగ్యాలు కూడా దరి చేరవు.
3. జాగింగ్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం మంచి నిద్ర. ఉదయం చేసే ఈ చిన్నపాటి వ్యాయమంతో రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. రోజంతా మెదడు ఆరోగ్యకరంగా పని చేయడం మూలాన రాత్రి వేళలో కునుకు ఇట్టే వచ్చేస్తుందట. పైగా .. ఉదయాన్నే ఆటోమేటిగ్గా నిద్ర లేచేందుకు మనసు సన్నద్ధం అవుతుందట.
4. డయాబెటిస్ ఉన్న వాళ్లలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడానికి జాగింగ్ ను మించిన ఔషధం లేదు. యువతీ యువకులు నిత్యకృత్యంగా జాగింగ్ ను మలుచుకుంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు నూటికి 90 శాతం తగ్గిపోతాయి. జన్యుపరంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదమూ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక జాగింగ్ చేస్తే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.