Saggu Biyyam Idli : సగ్గుబియ్యం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఇవి ఎంతో చలువ చేస్తాయి. కనుక వేసవిలో వీటిని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం చల్లగా మారుతుంది. ఇలా మనకు సగ్గు బియ్యం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటితో ఇడ్లీలను చేసుకుని కూడా తినవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గు బియ్యం ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గుబియ్యం – అర కప్పు, ఇడ్లీ రవ్వ – ఒక కప్పు, పెరుగు – 2 కప్పులు, నీళ్లు – తగినన్ని, ఉప్పు – తగినంత, బేకింగ్ సోడా – పావు టీస్పూన్, జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – కొద్దిగా.
సగ్గు బియ్యం ఇడ్లీ తయారు చేసే విధానం..
సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వలను విడివిడిగా కడగాలి. ఒక పాత్రలో పెరుగు వేయాలి. కడిగి ఉంచుకున్న సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వల మిశ్రమం వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. కొద్దిగా నీళ్లు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇడ్లీ రేకులలో వేసుకునే ముందు కొద్దిగా బేకింగ్ సోడా జత చేయాలి. ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె రాయాలి. ప్రతి గుంతలోనూ కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి ఆపైన ఇడ్లీ పిండి వేయాలి. ఇడ్లీ స్టాండులో తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ రేకులను అందులో ఉంచి స్టవ్ మీద పెట్టాలి. పది నిమిషాల తరువాత దింపేయాలి. కొద్దిగా చల్లారాక ఇడ్లీలను ప్లేట్లలోకి తీసుకుని కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో తింటే సగ్గు బియ్యం ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయి.