Meals : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. అధిక బరువు, డయాబెటిస్‌తోపాటు గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. అయితే మనం రోజూ తినే ఆహారంతోపాటు చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా ఈ వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా భోజనం చేసిన అనంతరం చాలా మంది అనేక రకాల తప్పులు చేస్తున్నారు. ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. అయితే ఆ తప్పులు చేయకుండా ఉంటే.. రోగాల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఇక భోజనం చేశాక చాలా మంది చేసే తప్పులు ఏమిటంటే..
1. భోజనం చేసిన వెంటనే కొందరికి టీ, కాఫీలను తాగే అలవాటు ఉంటుంది. ఇది మానుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ భోజనం చేశాక టీ లేదా కాఫీలను తాగరాదు. తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, అజీర్ణం, కడుపులో మంట ఇబ్బందులకు గురి చేస్తాయి. జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. కనుక భోజనం అనంతరం టీ లేదా కాఫీలను తాగరాదు. కనీసం 2 గంటల వ్యవధిని పాటించాలి. ఆ తరువాతే వాటిని తాగవచ్చు.
2. భోజనం చేసిన అనంతరం కొందరు స్నానం చేస్తారు. కానీ ఇలా చేయకూడదు. మనం ఆహారం తిన్న తరువాత రక్త ప్రసరణ వ్యవస్థ రక్తాన్ని జీర్ణాశయం వద్దకు పంపుతుంది. దీంతో మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అయితే అదే సమయంలో స్నానం చేస్తే రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. మనం శరీరంపై నీళ్లను పోయగానే దాని ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించేందుకు రక్త ప్రసరణ వ్యవస్థ రక్తాన్ని శరీర భాగాలకు పంపుతుంది. దీంతో జీర్ణవ్యవస్థకు తగినంత రక్తం లభించదు. దీని వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా గ్యాస్, అజీర్తి సమస్యలు వస్తాయి. కనుక తిన్న వెంటనే స్నానం చేయకూడదు.
3. భోజనం చేసిన వెంటనే నడక సాగిస్తే శరీరానికి మంచిదే. కానీ తిన్న వెంటనే వాకింగ్ చేయరాదు. కనీసం 30 నిమిషాలు ఆగాలి. ఆ తరువాత 10 నిమిషాల పాటు నిదానంగా వాకింగ్ చేయాలి. ఇది జీర్ణవ్యవస్థకు దోహదపడుతుంది. అలాగే షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
4. భోజనం చేసిన వెంటనే కొందరు పండ్లను తింటుంటారు. వాస్తవానికి మనం తినే ఆహారంతో పండ్లను కలిపి తినరాదు. తింటే పండ్లలో ఉండే పోషకాలు మన శరీరానికి లభించవు. మనం తిన్న ఆహారం పండ్లలో ఉండే పోషకాలను శరీరం శోషించుకోకుండా అడ్డుకుంటుంది. కనుక భోజనం చేసిన వెంటనే పండ్లను తినరాదు. కనీసం 2 గంటలు విరామం ఇచ్చి పండ్లను తినాలి. అప్పుడే పండ్ల ద్వారా మనకు ప్రయోజనాలు కలుగుతాయి.
5. తిన్న వెంటనే కొందరు నిద్రిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. మధ్యాహ్నం లేదా రాత్రి కొందరు భోజనం చేసిన వెంటనే పడుకుంటారు. ఇలా చేయడం వల్ల అధిక బరువు పెరుగుతారు. డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక తిన్న వెంటనే ఎట్టి పరిస్థితిలోనూ నిద్రించరాదు.
6. ఇక భోజనం చేసిన తరువాత కాసేపు విరామం ఇచ్చి ప్రయాణం సాగించాలి. లేదంటే ప్రయాణంలో వాంతులు అవుతాఇ. అలాగే భోజనం అనంతరం బరువులు ఎత్తడం, పనులు చేయడం వంటివి కూడా చేయరాదు. ఇలా ఈ సూచనలు పాటించడం వల్ల చాలా వరకు వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.