Palakura Tomato Curry : మనం తినే అనేక రకాల ఆకుకూరలల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూరను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. పాలకూరను తిడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.
ఇక పాలకూరతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలకూరతో చేసే వంటకాలలో పాలకూర టమాట కూడా ఒకటి. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. పాలకూర టమాట కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర టమాట కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – ఒక కట్ట (పెద్దది), తరిగిన టమాటాలు – 2, తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన పచ్చి మిర్చి – 2, నూనె – 3 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – రెండు టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్.
పాలకూర టమాట కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత ఉల్లిపాయలను వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమాట ముక్కలతోపాటు పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలను పూర్తిగా ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత పాలకూరను వేసి కలిపి మూత పెట్టి పాలకూరను పూర్తిగా ఉడికించుకోవాలి. పాలకూర ఉడికిన తరువాత మూత తీసి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకూర టమాట కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉండమే కాకుండా పాలకూర, టమాటల వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. మూత్ర పిండాలల్లో రాళ్లు ఉన్న వారు మాత్రం ఈ కూరను తినకూడదు.