Sleep : ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమితో బాధపడడానికి చాలా కారణాలు ఉంటున్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, మనం చేసే పని వంటి వాటిని నిద్రలేమికి కారణాలుగా చెప్పవచ్చు. కొందరి వారికి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రి సమయంలో భోజనం ఆలస్యంగా చేసినా కూడా రాత్రి సమయంలో నిద్ర పట్టదు. కారణాలు ఏవైనప్పటికీ నిద్రలేమి కూడా ఒక రకమైన అనారోగ్య సమస్యే. నిద్రలేమి కారణంగా మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి.
నిద్రలేమి కారణంగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. బరువు పెరుగుతారు. చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. నిద్రలేమి వల్ల షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 10 నుండి 15 శాతం లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుంది. కనుక రోజూ 6 నుండి 8 గంటల పాటు తప్పకుండా నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ఎటువంటి మందులను వాడే అవసరం లేకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మనం వంటింట్లో ఉపయోగించే పదార్థాలను వాడి ఈ సమస్యను మనం తగ్గించుకోవచ్చు.
నిద్రలేమి సమస్యను తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ధనియాలతో కాఫీ ని చేసుకుని పడుకునే ముందు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ధనియాలను ఒక అర గంట ముందు ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరగబెట్టి దానిని వడకట్టుకోవాలి. ఈ కషాయంలో తగినన్ని పాలను, పంచదారను వేసి కలిపి కాఫీలా చేసుకుని పడుకునే ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
రాత్రిపూట పెరుగు తిన్నా కూడా నిద్ర బాగా పడుతుంది. 20 గ్రా. ల నువ్వుల నూనెను తీసుకుని బాగా మరిగించి, అందులో కర్పూరాన్ని వేసి చల్లగా అయ్యే వరకు ఉంచి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను పడుకునే ముందు అరికాళ్లకు మర్దనా చేసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుంది. 2 టేబుల్ స్పూన్ల గసగసాలను తీసుకుని కొద్దిగా వేయించి వస్త్రంలో కట్టి వాసన చూస్తూ ఉండడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది.
జాజికాయను అరగదీసి నుదుటిపై రాసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అర గ్లాస్ పాలలో 100 గ్రా. ల గసగసాల పొడిని, పటిక బెల్లాన్ని వేసి కలిపి తాగడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది. అదే విధంగా రాత్రి పూట భోజనాన్ని కూడా త్వరగా చేయాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఈ సమస్య కారణంగా వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.