Money : లక్ష్మీ దేవి కరుణా కటాక్షాల కోసం, దయ కోసం ఎదురు చూడని వారు ఉండరు. లక్ష్మీ దేవి చల్లని చూపు మనపై ఉండాలని, ఆమె దృష్టిలో మనం ఎపుడూ ఉండాలని ఎన్నో పూజలు పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటాం. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అసలు లక్ష్మీ దేవి నివాస స్థానాన్ని, ఆమె కరుణ కోసం చేయాల్సిన పనులు ఏమిటి.. అని తెలుసుకునే ప్రయత్నాన్ని మనలో చాలా మంది చేయరు. లక్ష్మీ దేవి కరుణ కోసం యజ్ఞ, యాగాలే కాకుండా మన ఇంట్లో మనం చేసే పనుల మీద కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లక్ష్మీ దేవి కరుణ కోసం మనం శ్రద్ధ వహించాల్సిన పనులు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి భోజనం చేసిన తరువాత మనలో చాలా మంది పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు. ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు. అన్నాన్ని మనం లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తాము. కనుక రాత్రి భోజనం తరువాత పాత్రలన్నింటినీ, వంట వండిన ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. అలాగే భోజనం చేసేటప్పుడు గిన్నెలను పూర్తిగా ఊడ్చుకుని తినరాదట. రాత్రి పూట దేవతలు, మన పితృ దేవతలు వస్తారట. వారు వచ్చి ఇంట్లో అన్నం ఉందో లేదో చూస్తారట. ఇలా చూసి అన్నం లేకపోతే ఆకలితో తిరిగి వెళ్లి మనల్ని శపిస్తారట. ఒకవేళ అన్నం ఉంటే మనల్ని అన్నానికి లోటు లేకుండా ఉండాలని దీవిస్తారట. రాత్రి కొద్దిగా అన్నాన్ని గిన్నెలో ఉంచి మూత పెట్టి మిగిలిన పాత్రలన్నింటినీ శుభ్రం చేసుకోవాలట. అలాగే లక్ష్మీ దేవి నివాస స్థానమైన గడపను తొక్క కూడదు. గడప ముందు చెప్పులను చిందరవందరగా ఉంచకూడదు. పసుపు, కుంకుమలు ఉన్న గడపలు లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి. కనుక రోజూ వీలుకాకపోతే కనీసం శుక్రవారం అయినా గడపకు పసుపు, కుంకుమతో అలంకరించాలి.
ఇంటి ద్వారం వద్ద ఉండే తలుపుకు కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి కల్లా ధూపదీప నైవేద్యాలను సమర్పించి పూజ చేయాలి. అదే విధంగా ఇంట్లో పాత వస్తువులను, విరిగిపోయిన, చిరిపోయిన వస్తువులను ఉంచుకోకూడదు. ఇళ్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంటి ముందు ప్రతి రోజూ ముగ్గు వేయాలి. ఇంట్లో ఇల్లాలు ఏడవడం, గట్టిగా మాట్లాడడం, శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా తిరగడం, చెడు మాటలు మాట్లాడడం వంటివి చేయకూడదు. ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటే కూడా లక్ష్మీ దేవి ఇంట్లో ఉండదు. ఇంట్లో ఉండే పెద్దలను తిడితే కూడా ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదు. ఇంట్లో సంధ్యా సమయంలో దీపం వెలిగించిన తరువాతే కరెంటు దీపాలను వేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీ దేవి వస్తుంది. ఆ తల్లి కరుణ ఎప్పుడూ మనపై ఉంటుంది.