Kara Boondi : మనం వంటింట్లో శనగ పిండిని ఉపయోగించి రకరకాల చిరు తిళ్లను తయారు చేస్తూ ఉంటాం. శనగ పిండితో చేసే అన్ని రకాల చిరు తిళ్లు చాలా రుచిగా ఉంటాయి. శనగ పిండిని ఉపయోగించి చేసే చిరు తిళ్లల్లో కారం బూందీ కూడా ఒకటి. కారం బూందీని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈ కారం బూందీ మనకు బయట కూడా దొరుకుతుంది. దీనిని ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే కొందరికి ఎంత ప్రయత్నించినా కారం బూందీ కరకరలాడుతూ ఉండేలా తయారు చేసుకోవడం రాదు. బయట దొరికే విధంగా కరకరలాడుతూ ఉండే విధంగా కారం బూందీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కారం బూందీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగ పిండి – ఒక కప్పు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, వేడి చేసిన నూనె – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – గుప్పెడు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, కారం – 1 టీ స్పూన్.
కారం బూందీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగ పిండిని, పసుపును, కొద్దిగా, వేడి చేసిన నూనెను వేసి తగినన్ని నీళ్లను పోసుకుంటూ మరీ పలుచగా కాకుండా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత జల్లి గిన్నెను లేదా జల్లి గంటెను లేదా చిల్లులు ఉన్న ప్లేట్ తీసుకుని దానిలో పిండిని తీసుకుంటూ చేత్తో కానీ గంటెతో కానీ పిండి నూనెలో పడేలా రుద్దాలి. ఇప్పుడు బూందీని గంటెతో కదిలిస్తూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండి అంతా అయిపోయే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో పల్లీలను, కరివేపాకును కూడా వేసి కరివేపాకు కరకరలాడే వరకు వేయించి బూందీలో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా, కరకరలాడుతూ ఉండే కారం బూందీ తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. బయట దొరికే చిరు తిళ్లను తినడానికి బదులుగా ఇలా కారం బూందీని తయారు చేసి నిల్వ చేసుకోవడం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు తినవచ్చు.