Coriander Seeds Water : ప్రతి ఒక్కరి వంటింట్లో సర్వ సాధారణంగా ఉండే వాటిల్లో ధనియాలు కూడా ఒకటి. ధనియాల పొడిని, ధనియాలను మనం తరచూ వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో ధనియాల పొడిని ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మనం వంటల్లో ఉపయోగించే కొత్తిమీర నుంచే మనకు ధనియాలు వస్తాయి. వంటల్లో కొత్తిమీరను ఉపయోగించినా కూడా మనకు మేలు కలుగుతుంది.
ధనియాలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయని వీటిని ఉపయోగించి మనం అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి తయారు చేసే కషాయాలలో కూడా ధనియాలను ఉపయోగిస్తూ ఉంటాం. ధనియాల వల్ల మనకు కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధనియాలను దంచి నీటిలో వేసి మరిగించి వడకట్టి కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇలా ధనియాలను మరిగించిన నీటిని ప్రతిరోజూ తాగుతూ ఉండడం వల్ల మూత్రం ధారాళంగా వస్తుంది.
ధనియాలలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ప్రేగుల్లో కదలికలను పెంచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ధనియాల కషాయాన్ని తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో అధికంగా ఉండే నీరు కూడా బయటకు పోయి వాపులు తగ్గుతాయి. ధనియాల కషాయాన్ని తాగడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను ఎల్లప్పుడూ నియంత్రించడంలో ధనియాల కషాయం సహాయపడుతుంది.
ధనియాల కషాయాన్ని లేదా ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ధనియాల కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ కషాయాన్ని తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. మజ్జిగలో ధనియాల పొడిని లేదా కొత్తిమీరను వేసుకుని తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, వికారం, అజీర్తితోపాటు పెద్ద ప్రేగు శూల సమస్యలు కూడా నయం అవుతాయి. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే స్త్రీలు అర లీటర్ నీటిలో 6 గ్రాముల ధనియాలను వేసి మరిగించి వడకట్టాలి. ఈ నీటికి పంచదారను కలుపుకుని తాగడం వల్ల అధిక రక్త స్రావం సమస్య తగ్గుతుంది. ఈ విధంగా ధనియాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.